సహచరుడితో చాట్‌జీపీటీ సీఈఓ వివాహం!

12 Jan, 2024 11:41 IST|Sakshi

శామ్‌ ఆల్ట్‌మన్‌..ఓపెన్‌ ఏఐ సీఈఓ. ప్రపంచానికి చాట్‌జీపీటీను పరిచయం చేసి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో ఓ కీలకమార్పు తీసుకొచ్చి అన్ని దిగ్గజ టెక్‌ కంపెనీలకు సవాలు విసిరిన ఘనుడు. అలాంటి వ్యక్తిని కొద్ది రోజుల క్రితం ఓపెన్‌ ఏఐ సంస్థ బోర్డ్‌ అతనిని సీఈఓ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాల వల్ల ఆల్ట్‌మన్‌ను తిరిగి సంస్థలోకి తీసుకోక తప్పలేదు. 

తాజాగా శామ్‌ ఆల్ట్‌మన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ ఆలివర్‌ మల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. ఈమేరకు వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాంతో ఆల్ట్‌మన్‌ తన పెళ్లిపై స్పందిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. హవాయ్‌ నగరంలో సముద్రపు ఒడ్డున కొంతమంది సన్నిహితుల మధ్య వీరు ఒక్కటైనట్లు మీడియా కథనాల్లో వెల్లడైంది.

శామ్‌ వివాహ చేసుకున్న మల్హెరిన్‌ ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయం నుంచి ఆయన పట్టా పొందినట్లు మల్హెరిన్‌ లింక్డిన్‌ ప్రొఫైల్‌ ప్రకారం తెలుస్తోంది. 2020 ఆగస్టు నుంచి 2022 నవంబర్‌ వరకు మెటాలో పనిచేశారు. ఆల్ట్‌మన్‌, మల్హెరిన్‌ తమ బంధం గురించి ఎప్పుడూ బయట మాట్లాడిన సందర్భాలు లేవు. 

ఇదీ చదవండి: సినిమా చూపిస్తూ కోట్లు సంపాదన!

2023 సెప్టెంబర్‌లో న్యూయార్క్‌ మ్యాగజైన్‌ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరూ శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒకే ఇంట్లో ఉంటున్నట్లు ఆల్ట్‌మన్‌ వెల్లడించారు. గత ఏడాది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విందుకు ఆల్ట్‌మన్‌ మొదటిసారి మల్హెరిన్‌తో కలిసి వచ్చారు. ఇదిలాఉండగా హై స్కూల్‌లో చదువుతున్న సమయంలోనే తాను ‘గే’నని ఆల్ట్‌మన్‌ ప్రకటించారు. తొమ్మిదేళ్ల పాటు లూప్ట్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్‌ సివోతో డేటింగ్‌ చేసి 2012లో శామ్‌ విడిపోయారు.

>
మరిన్ని వార్తలు