ఆప్టిమ్‌హైర్‌లో నియామకాలు

4 Mar, 2022 06:35 IST|Sakshi
మీడియాతో పవన్‌ కుమార్‌ రావు, లక్ష్మి ఎం కొడాలి, అశుతోష్‌ వ్యాస్‌ (ఎడమ నుంచి)

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐటీ రంగానికి నియామక సేవలు అందిస్తున్న హైదరాబాద్‌ కంపెనీ ఆప్టిమ్‌హైర్‌ ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగుల సంఖ్యను 300లకు చేర్చనుంది. ప్రస్తుతం కంపెనీలో 120 మంది సిబ్బంది ఉన్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కంపెనీకి 120కి పైచిలుకు క్లయింట్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆరు లక్షల మంది అభ్యర్థుల ముందస్తు ఇంటర్వ్యూలు పూర్తి చేశామని ఆప్టిమ్‌హైర్‌ ఫౌండర్, సీఈవో లక్ష్మి ఎం కొడాలి తెలిపారు. కో–ఫౌండర్‌ సీహెచ్‌.పవన్‌ కుమార్‌ రావు, మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అశుతోష్‌ వ్యాస్‌తో కలిసి గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.

‘మిడ్, సీనియర్‌ లెవెల్‌ ఉద్యోగి నియామకానికి కంపెనీలకు ఆరు నెలల దాకా సమయం పడుతోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్‌ సాయంతో ఈ సమయాన్ని 12 రోజులకు కుదించగలిగాం. రెండు, మూడు ఇంటర్వ్యూ దశలను తగ్గించేలా అభ్యర్థులను వడపోస్తాం. మా వేదిక ద్వారా 5,700 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరి గరిష్ట వేతనం భారత్‌లో రూ.80 లక్షలు, యూఎస్‌లో రూ.3 కోట్ల వరకు ఉంది. రెఫరల్‌ పార్ట్‌నర్స్‌ 2,000 మంది ఉన్నారు. అభ్యర్థులను రెఫర్‌ చేయడం ద్వారా వీరు నెలకు రూ.6 లక్షల వరకు సంపాదిస్తున్నారు’ అని వివరించారు.   
 

మరిన్ని వార్తలు