ఆప్టిమస్‌ కోవిడ్‌ ఔషధానికి అనుమతి

25 Jul, 2020 05:40 IST|Sakshi
ఫావికోవిడ్‌ ట్యాబ్లెట్లతో ప్రశాంత్‌ రెడ్డి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 చికిత్సలో ఉపయోగించే ఫావిపిరావిర్‌ ట్యాబ్లెట్ల తయారీకి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి లభించిందని హైదరాబాద్‌ కంపెనీ ఆప్టిమస్‌ ఫార్మా వెల్లడించింది. ఫావిపిరావిర్‌ యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్‌ తయారీకి తమ అనుబంధ కంపెనీ ఆప్‌ట్రిక్స్‌ ల్యాబొరేటరీస్‌ లైసెన్సు దక్కించుకుందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ట్యాబ్లెట్లను ఫావికోవిడ్‌ పేరుతో మార్కెట్‌ చేయనున్నారు.

ట్యాబ్లెట్ల విక్రయ ధరను ఒకట్రెండు రోజుల్లో నిర్ణయిస్తామని ఆప్టిమస్‌ డైరెక్టర్‌ పి.ప్రశాంత్‌ రెడ్డి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘అందుబాటులో ఉండే విధంగా ఈ ధర ఉంటుంది. ఇతర కంపెనీలకు కూడా ఈ ట్యాబ్లెట్లను తయారు చేసి సరఫరా చేస్తున్నాం. నెలకు ఒక కోటి ట్యాబ్లెట్లకు డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్నాం. ఔషధానికి కావాల్సిన స్టార్టింగ్‌ మెటీరియల్, కాంప్లెక్స్‌ ఇంటర్మీడియేట్స్‌ను సొంతంగా ఉత్పత్తి చేశాం.

2004లో కంపెనీ ప్రారంభమైంది. మూడు ఏపీఐ ప్లాంట్లు, ఒకటి ఫార్ములేషన్స్‌ తయారీ యూనిట్‌ ఉంది. ఏపీఐలు 10 దేశాలకు, ఫార్ములేషన్స్‌ 15 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇప్పటి వరకు రూ.500 కోట్లకుపైగా పెట్టుబడి చేశాం. 1,100 మంది దాకా ఉద్యోగులు ఉన్నారు. 2019–20లో రూ.700 కోట్ల టర్నోవర్‌ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ స్థాయిలోనే టర్నోవర్‌ ఆశిస్తున్నాం. మార్కెట్లో చాలా ఉత్పత్తుల వినియోగం పడిపోవడమే ఇందుకు కారణం’ అని వివరించారు.
 

మరిన్ని వార్తలు