కోవిడ్‌ చికిత్సలో మరో ముందడుగు

20 May, 2021 02:00 IST|Sakshi

భారత్‌లో మోల్నుపిరావిర్‌ ఔషధ పరీక్షలు

అయిదు కంపెనీలకు డీసీజీఐ అనుమతి!

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 చికిత్సలో ఉపయోగించే యాంటీవైరల్‌ డ్రగ్‌ మోల్నుపిరావిర్‌ విషయంలో భారత్‌లో మరో ముందడుగు పడింది. మూడవ దశ ఔషధ పరీక్షలకై అయిదు కంపెనీలకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. ఈ జాబితాలో తాము కూడా ఉన్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్‌ ఫార్మా బుధవారం ప్రకటించింది. స్వల్ప, మోస్తరు కోవిడ్‌–19 లక్షణాలున్న 2,500 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్టు ఆప్టిమస్‌ సీఎండీ డి.శ్రీనివాస్‌ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మోల్నుపిరావిర్‌ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్‌ (ఏపీఐ), ఫార్ములేషన్స్‌ను తాము సొంతంగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఔషధ పరీక్షల్లో భాగంగా రోగులకు గరిష్టంగా అయిదు రోజుల చికిత్స ఉంటుందని, 29 రోజులపాటు అధ్యయనం కొనసాగుతుందని చెప్పారు. క్లినికల్‌ ట్రయల్స్‌ ద్వారా ఔషధ సామర్థ్యం తెలుస్తుందని వివరించారు.  

అయిదు రోజుల్లోనే..: యూఎస్‌లో జరిగిన ఔషధ పరీక్షల్లో మోల్నుపిరావిర్‌ తీసుకున్న స్వల్ప, మోస్తరు కోవిడ్‌–19 లక్షణాలున్న రోగులు అయిదు రోజుల్లోనే కోలుకున్నారని ఆప్టిమస్‌ ఫార్మా డైరెక్టర్‌ పి.ప్రశాంత్‌ రెడ్డి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘చికిత్సలో భాగంగా 800 ఎంజీ మోతాదులో ఉదయం, రాత్రి 5 రోజులపాటు మోల్నుపిరావిర్‌ క్యాప్సూల్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో రోగి శరీరం నుంచి వైరస్‌ పూర్తిగా తొలగిపోతుంది. ఔషధాన్ని తీసుకున్న రోజు నుంచే రోగి ద్వారా వేరొకరికి వైరస్‌ వ్యాపించకపోవడం దీని ప్రత్యేకత. మోల్నుపిరావిర్‌ ఏపీఐ, ఫార్ములేషన్స్‌ అభివృద్ధి, క్లినికల్‌ ట్రయల్స్‌కు భారీగా ఖర్చు ఉంటుంది. ఇతర ఔషధాల మాదిరిగానే మార్కెట్లోకి వచ్చిన నెల తర్వాత ధర తగ్గుతుంది. జూలై ప్రారంభంలో సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీవో)కు ఔషధ పరీక్షల ఫలితాల నివేదిక సమర్పించే అవకాశం ఉంది’ అని చెప్పారు. ఆప్టిమస్‌ ఫార్మా మోల్నుపిరావిర్‌ ఫేజ్‌–3 క్లినికల్‌ ట్రయల్స్‌కై సీడీఎస్‌సీవోకు ఏప్రిల్‌ 26న దరఖాస్తు చేసుకుంది.

మరిన్ని వార్తలు