ఫేస్‌బుక్‌ అధినేతపై ఆస్కార్‌ దర్శకుడి ఆగ్రహం

5 Aug, 2021 12:55 IST|Sakshi

ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు హాలీవుడ్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌ కెన్‌ బర్న్స్‌. అమెరికాకు ప్రధాన శత్రువు జుకర్‌బర్గేనంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఫేస్‌బుక్‌ ద్వారా తప్పుడు సమాచారం వ్యాపింపజేస్తున్నాడని, ముందు అతన్ని(జుకర్‌బర్గ్‌) జైళ్లో పడేయాలని ఊగిపోయాడు కెన్‌. 

‘‘ఒక డెమొక్రాట్‌గా నేను ఈ విషయం చెప్పట్లేదు. అమెరికా చరిత్రలో బహుశా జుకర్‌బర్గ్‌ అంతటి ద్రోహి మరొకరు ఉండడేమో. ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారంతో ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తున్నాడు. ఫేస్‌బుక్‌ పోస్టులతో మనుషుల మానసిక స్థితితో ఆడుకుంటున్నాడు. అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు. ప్రైవసీ లేని వ్యవహారం ఫేస్‌బుక్‌ అంటే. అతన్నే కాదు.. అతని సహోద్యోగిణి షెరిల్‌ శాండ్‌బర్గ్‌(ఫేస్‌బుక్‌ సీవోవో)ను కూడా లాక్కెళ్లి జైళ్లో పడేయండి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాజీలను న్యూరెంబర్గ్‌ దగ్గర ఎట్లా విచారించారో.. అట్లా టెక్‌ దిగ్గజాలమని చెప్పుకుంటున్న వీళ్లను విచారించండి’ అంటూ ఫైర్‌ అయ్యాడు కెన్‌.

రెండుసార్లు ఆస్కార్‌ గ్రహీత అయిన బర్న్స్‌.. డెమొక్రటిక్‌ మద్ధతుదారుడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫేస్‌బుక్‌ చీఫ్‌పై ఈ ఆరోపణలు చేశాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక న్యూయార్క్‌ టైమ్స్‌ టెక్‌ జర్నలిస్ట్‌ కారా స్విషర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బర్న్స్‌ పై ఆరోపణలు చేశాడు. అయితే కారా ఏం అడగకపోయినా.. జుకర్‌బర్గ్‌ పేరు ప్రస్తావనకు తెచ్చి మరీ చిందులేశాడు ఈ డైరెక్టర్‌. ఇదిలా ఉంటే 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలో ఫేస్‌బుక్‌ మీద సంచలన ఆరోపణలు వెల్లువెత్తినప్పటి నుంచి ‘ప్రైవసీ’ వ్యతిరేకత కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు