వాయిస్‌ బీపీవో హబ్‌గా భారత్‌..

24 Jun, 2021 06:05 IST|Sakshi

నిబంధనలు మరింత సరళతరం చేసిన కేంద్రం

ఓఎస్‌పీ సెంటర్ల మధ్య ఇంటర్‌ కనెక్టివిటీకి అనుమతులు

న్యూఢిల్లీ: వాయిస్‌ ఆధారిత బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ (బీపీవో) కార్యకలాపాలకు భారత్‌ను ప్రధాన హబ్‌గా తీర్చిదిద్దే దిశగా దీనికి సంబంధించిన నిబంధనలను కేంద్రం మరింత సరళతరం చేసింది. అన్ని రకాల ఓఎస్‌పీ (ఇతర సర్వీస్‌ ప్రొవైడర్స్‌) మధ్య ఇంటర్‌ కనెక్టివిటీని అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, దేశీ, విదేశీ యూనిట్లకు ఒకే రకం నిబంధనలను వర్తింపచేయనుంది. వీటితో పాటు మరికొన్ని నిబంధనల సడలింపుతో భారత్‌లో వాయిస్‌ ఆధారిత సెంటర్‌ ఉన్న అంతర్జాతీయ సంస్థలు.. ఇకపై ఉమ్మడి టెలికం వనరులను ఉపయోగించుకుని దేశ, విదేశాల్లో కస్టమర్లకు సర్వీసులు అందించడానికి వీలు కానుంది.

ఇప్పటిదాకా ఇలాంటి సేవల కోసం ప్రతీ కంపెనీ తమ సొంత మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉండేది. తాజా పరిణామాలతో కంపెనీలు తమ వనరులను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడానికి వీలు కానుంది. ‘సరళతరం చేసిన నిబంధనలతో బీపీవో పరిశ్రమలో సింహ భాగం వాటాను భారత్‌ దక్కించుకోగలదు‘ అని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, ఐటీ–బీపీఎం పరిశ్రమ వృద్ధికి దోహదపడటంతో పాటు వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు నిబంధనల సడలింపు తోడ్పడగలదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ పేర్కొంది.  

టెక్‌ రంగం వృద్ధికి దోహదం..
గతేడాది నవంబర్‌లోనే ఓఎస్‌పీ మార్గదర్శకాల్లో కొన్నింటిని సరళతరం చేశామని, తాజాగా వీటిని మరింత సడలించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీనితో అనేకానేక నిబంధనలను పాటించాల్సిన భారం కంపెనీలకు తగ్గుతుందని, టెక్‌ పరిశ్రమ వృద్ధికి ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. టెలికం వనరులను ఉపయోగించుకుని అప్లికేషన్‌ సర్వీసులు, ఐటీ ఆధారిత సేవలు, కాల్‌ సెంటర్‌ సేవలు లేదా ఇతరత్రా అవుట్‌సోర్సింగ్‌ సర్వీసులు అందించే సంస్థలను ఓఎస్‌పీలుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, 2019–20లో 37.6 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ. 2.8 లక్షల కోట్లు) ఉన్న దేశీ ఐటీ–బీపీవో పరిశ్రమ 2025 నాటికి 55.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 3.9 లక్షల కోట్లు)కు చేరగలదని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు