ఓటీటీ దెబ్బకు ఇండియన్‌ బిగెస్ట్‌ సినిమా బ్రాండ్ల విలీనం..!

27 Mar, 2022 18:50 IST|Sakshi

భారత్‌లోని అతిపెద్ద మల్టీప్లెక్స్‌ బ్రాండ్స్‌ పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్‌ లిమిటెడ్‌ సంస్థలు పూర్తిగా వీలినమయ్యాయి.  కంపెనీల వీలినాన్ని  డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని పీవీఆర్ లిమిటెడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఐనాక్స్ బోర్డు కూడా విలీనాన్ని ఆమోదించింది. 

మల్టీప్లెక్స్‌ సంస్థల్లో ఇరు కంపెనీల వీలినం అతి పెద్ద డీల్‌గా నిలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్‌ ఎగ్జిబిషన్‌ కంపెనీగా పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌ అవతరించనుంది. విలీనానంతర సంస్థకు పీవీఆర్‌ సీఎండీ అజయ్‌ బిజ్లీ ఎండీగా కొనసాగనున్నారు. ఇదే సంస్థకు చెందిన సంజీవ్‌ కుమార్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఐనాక్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ పవన్‌ కుమార్‌ జైన్‌ బోర్డు నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా, సిద్థార్థ్‌ జైన్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌,  నాన్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఉండనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఎక్సేంజీలకు ఇరు సంస్థలు వెల్లడించాయి. 

వీలినంలో భాగంగా ఐనాక్స్‌ షేర్‌ హోల్డర్లందరికీ పీవీఆర్‌ షేర్లు లభించనున్నాయి. కాగా ఈ వీలినానికి ఎక్సేచేంజ్‌లు, సెబీ, సీసీఐ నుంచి అనుమతి రావాల్సి ఉంది. కొత్తగా ఏర్పడే సంస్థలో పీవీఆర్‌ ప్రమోటర్లకు 10.62 శాతం వాటా, ఐనాక్స్‌ ప్రమోటర్లకు 16.66 శాతం వాటా లభించనుంది. దేశవ్యాప్తంగా పీవీఆర్‌కు 73 పట్టణాల్లోని 181 ప్రాంతాల్లో 871 స్క్రీన్స్‌ ఉన్నాయి. ఐనాక్స్‌కు 72 పట్టణాల్లోని 160 ప్రాంతాల్లో 675 తెరలున్నాయి. 

ఓటీటీ కారణం..
కోవిడ్‌-19 రాకతో థియేటర్లు భారీ నష్టాలను చవిచూశాయి. థియేటర్లు పూర్తిగా మూసివేయడంతో సినీ నిర్మాతలు అమెజాన్‌ ప్రైం, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ+హట్‌స్టార్‌ వంటి ఓటీటీ సంస్థల తలుపులను తట్టారు. అదే స్థాయిలో ఓటీటీ సంస్థలు కూడా సినిమాలకు భారీ మొత్తంలోనే డబ్బులను చెల్లించాయి. దీంతో థియేటర్ల మనుగడకు భారంగా మారింది. ఇక సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. నష్టాలను పూడ్చుకోవడానికి థియేటర్ల యాజమాన్యం ఫంక్షన్‌ హాల్స్‌గా మార్చేశారు. ఓటీటీ సంస్థల నుంచి వీపరితమైన పోటీ రావడంతో ఇండియన్‌ బిగెస్ట్‌ సినిమా బ్రాండ్లు పీవీఆర్‌, ఐనాక్స్‌ విలీనానికి దారి తీసినట్లు తెలుస్తోంది. 

చదవండి: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌...తల్లిదండ్రులకు షాకింగ్‌ న్యూస్‌..!

మరిన్ని వార్తలు