మీడియా@65 బిలియన్‌ డాలర్లు!

17 Nov, 2022 10:11 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ మీడియా, వినోద (ఎంఅండ్‌ఈ) పరిశ్రమ 2030 నాటికి 55–65 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. ఓటీటీ, గేమింగ్‌ విభాగాలు ఇందుకు ఊతంగా ఉండనున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఎంఅండ్‌ఈ రంగం 2022లో 27–29 బిలియన్‌ డాలర్లుగా ఉండనుంది. ‘పటిష్టమైన వృద్ధి చోదకాలు ఉన్నందున 2030 నాటికి పరిశ్రమ 55–65 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చు.

65–70 బిలియన్‌ డాలర్లకు కూడా చేరే సామర్థ్యాలు ఉన్నాయి. ఓటీటీ, గేమింగ్‌ విభాగాల వృద్ధి ఇందుకు తోడ్పడనుంది‘ అని నివేదిక పేర్కొంది. టెక్నాలజీ పురోగతి, వినియోగదారుల ధోరణుల్లో మార్పులతో మీడియాలోని కొన్ని విభాగాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని.. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఇది ఎక్కువగా ఉందని తెలిపింది. పరిశ్రమ ‘బూమ్‌‘కు డిజిటల్‌ వీడియో, గేమింగ్‌ సెగ్మెంట్‌లు దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది. దీని ప్రకారం ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల జోరుతో 2022లో మొత్తం మీడియా వినియోగంలో వీటి వాటా 40%గా ఉంది.  

డిజిటల్‌.. డిజిటల్‌.. 
మిగతా సెగ్మెంట్ల కన్నా ఎక్కువగా డిజిటల్‌ వినియోగం వృద్ధి చెందుతోంది. 2020–2022 మధ్య కాలంలో భారత ఎంఅండ్‌ఈ పరిశ్రమ దాదాపు 6 బిలియన్‌ డాలర్ల మేర వృద్ధి చెందగా, ఇందులో మూడింట రెండొంతుల వాటా డిజిటల్‌దే కావడం గమనార్హం. నివేదిక ప్రకారం సబ్‌స్క్రిప్షన్‌ వీడియో ఆన్‌ డిమాండ్‌ (ఎస్‌వీవోడీ) చందాలు 2022లో 8–9 కోట్ల మేర పెరగవచ్చు. ప్రస్తుతం ప్రీమియం, ప్రత్యేకమైన కంటెంట్‌ కోసం చెల్లించడానికి యూజర్లలో మరింత సుముఖత పెరుగుతోంది.

2030 నాటికి మొత్తం ఓటీటీ ఆదాయంలో ఎస్‌వీవోడీ వాటా 55–60%గా ఉండనుంది. పరిశ్రమపై కొత్త ధోరణులు దీర్ఘకాలిక ప్రభావాలు చూపనున్నాయి. మెటావర్స్‌ మొదలైన టెక్నాలజీల వినియోగం .. గేమింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా మిగతా రంగాల్లోకి గణనీయంగా విస్తరించనుంది.

చదవండి: ‘గూగుల్‌ పే.. ఈ యాప్‌ పనికి రాదు’ మండిపడుతున్న యూజర్లు, అసలేం జరిగింది!

మరిన్ని వార్తలు