టాయ్‌లెట్స్‌కు సున్నం వేయకున్నా జైలే..

11 Feb, 2022 04:24 IST|Sakshi

వ్యాపార సంస్థలకు ని’బంధనాలు’

26 వేల పైచిలుకు క్లాజుల్లో జైలు శిక్షకు ఆస్కారం

ఓఆర్‌ఎఫ్‌ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశ ద్రోహం కింద పరిగణించే నేరాలకు తీవ్రమైన శిక్షలు ఉంటాయి. అయితే, వ్యాపార సంస్థలు మరుగుదొడ్లకు (లెట్రిన్లు, యూరినల్స్‌) నాలుగు నెలలకోసారి సున్నాలు వేయకపోయినా కూడా అదే స్థాయిలో ఏడాది నుంచి మూడేళ్ల వరకూ శిక్షలు వేయొచ్చని చట్టాలు చెబుతున్నాయి. ఇలా జైలు శిక్షకు ఆస్కారం ఉన్న అనేకానేక నిబంధనలను తూచా తప్పకుండా పాటించలేక దేశీయంగా వ్యాపారాలు నానా తంటాలు పడుతున్నాయని అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఓఆర్‌ఎఫ్‌) ఒక అధ్యయనంలో వెల్లడించింది.

’వ్యాపారం చేస్తే జైలుశిక్ష: భారత వ్యాపార చట్టాల్లో 26,134 జైలు శిక్ష క్లాజులు’ పేరిట టీమ్‌లీజ్‌ సంస్థతో కలిసి ఓఆర్‌ఎఫ్‌ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం భారత్‌లో వ్యాపార సంస్థల నియంత్రణకు నిర్దేశించిన నిబంధనలు 69,233 పైచిలుకు ఉన్నాయి. వీటిని పాటించకపోతే జరిమానాగా జైలు శిక్ష విధించేలా 26,134 క్లాజులు ఉన్నాయి. ‘ప్రతి అయిదు నిబంధనలకు కనీసం రెండు క్లాజులు .. వ్యాపారవేత్తలను జైలుకు పంపే విధంగా (నిబంధనలను పాటించనందుకుగాను) ఉంటున్నాయి‘ అని ఓఆర్‌ఎఫ్‌ పేర్కొంది. పారిశ్రామిక రంగంలో ముందున్న అయిదు రాష్ట్రాల (గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు) వ్యాపార చట్టాల్లో కనీసం 1,000కి పైగా జైలు శిక్ష క్లాజులు ఉన్నాయని వివరించింది.  

ఏటా రూ. 18 లక్షల భారం..
అధ్యయనం ప్రకారం.. 150 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్న సగటు చిన్న తరహా తయారీ సంస్థ (ఎంఎస్‌ఎంఈ) ఏటా 500–900 పైచిలుకు నిబంధనలు పాటించాల్సి వస్తోంది. ఈ భారం ఏటా రూ. 12–18 లక్షల స్థాయిలో ఉంటోంది. స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచీ చేసిన అనేకానేక వ్యాపార చట్టాల్లో జైలు శిక్ష నిబంధనల వల్ల భారత్‌లో వ్యాపారాలు చేయడం సవాళ్లతో కూడుకున్నదిగా మారిందని ఓఆర్‌ఎఫ్‌ తెలిపింది. అతి నియంత్రణ వల్ల లాభాల కోసం పని చేసే సంస్థలతో పాటు లాభాపేక్ష లేని సంస్థలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంది. టాయ్‌లెట్లను శుభ్రం చేయకపోవడాన్ని కూడా దేశద్రోహ నేరానికి సమానంగా పరిగణించి శిక్ష వేసేలా నిబంధనలు ఉండటం ఇందుకు ఉదాహరణగా ఓఆర్‌ఎఫ్‌ వివరించింది.

అసంఖ్యాక నిబంధనలను పాటించేలా వ్యాపారవేత్తలను క్రిమినల్‌ శిక్షలతో అతిగా భయపెట్టడం వల్ల అవినీతి చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. అనవసర నిబంధనలను తొలగించే విషయంలో ప్రభుత్వం శుభారంభం చేసిందని.. దాన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయిలో 26,134 జైలు క్లాజులకు కూడా విస్తరించాలని టీమ్‌లీజ్‌ వైస్‌ చైర్మన్‌ మనీష్‌ సబర్వాల్‌ తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించి గత ఏడేళ్లుగా సేకరించిన వివరాల ఆధారంగా డేటాను లేబర్, ఫైనాన్స్, ఆరోగ్యం తదితర ఏడు విభాగాల కింద ఓఆర్‌ఎఫ్‌ వర్గీకరించింది. దీని ప్రకారం అయిదు రాష్ట్రాల వ్యాపార చట్టాల్లో 1,000కి పైగా జైలు శిక్ష క్లాజులు ఉన్నాయి. గుజరాత్‌ (1,469), పంజాబ్‌ (1,273), మహారాష్ట్ర (1,210), కర్ణాటక (1,175), తమిళనాడు (1,043) ఈ జాబితాలో ఉన్నాయి.

క్రమబద్ధీకరించేందుకు పది సూత్రాలు..
మితిమీరిన నిబంధనల భారాన్ని తగ్గించే దిశగా వ్యాపార చట్టాలు, నియంత్రణలను క్రమబద్ధీకరించేందుకు నివేదికలో పది సూత్రాలను ప్రతిపాదించారు. క్రిమినల్‌ పెనాల్టీలను విధించడంలో సంయమనం పాటించడం, నియంత్రణల ప్రభావాలను మదింపు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయడం, జైలు శిక్ష విధించే క్లాజులను క్రమబద్ధీకరించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఉద్దేశ్యపూర్వకమైన ఉల్లంఘనలకు (పన్నుల ఎగవేత, పర్యావరణ విధ్వంసం మొదలైనవి) జైలు శిక్ష నిబంధనను కొనసాగిస్తూనే..  ప్రక్రియపరమైన లోపాలు, ఉద్దేశ్యపూర్వకం కాని తప్పిదాలను క్రిమినల్‌ పరిధి నుంచి తప్పించవచ్చని నివేదిక సూచించింది. పౌరులు, రాజకీయవేత్తలు, అధికారులు కూడా ఈ సంస్కరణల విషయంలో తగు చొరవ చూపాలని పేర్కొంది.
 

>
మరిన్ని వార్తలు