రహదార్లపై 4 కోట్లకు పైగా పాత వాహనాలు

29 Mar, 2021 02:37 IST|Sakshi

కర్ణాటకలో అత్యధికంగా 70 లక్షలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా పాత వాహనాలు (15 ఏళ్లు పైబడినవి) రహదారులపై తిరుగుతున్నాయి. వీటిలో రెండు కోట్ల పైగా వాహనాలు 20 ఏళ్ల పైబడినవి ఉన్నాయి. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాల్లో వాహనాల గణాంకాలను డిజిటైజ్‌ చేసిన నేపథ్యంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రికార్డులు అందుబాటులో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్‌ గణాంకాలను ఇందులో పొందుపర్చలేదు. కర్ణాటకలో ఇలాంటివి అత్యధికంగా 70 లక్షలు పైచిలుకు ఉన్నాయి. 56.54 లక్షల పాత వాహనాలతో ఉత్తర్‌ప్రదేశ్‌ రెండో స్థానంలో, 49.93 లక్షల వాహనాలతో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలోనూ ఉన్నాయి.

పర్యావరణ అనుకూల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే క్రమంలో కాలుష్యకారక పాత వాహనాలపై పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే హరిత పన్నుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్రాలకు కేంద్రం పంపించింది. దీని ద్వారా వచ్చే నిధులను కాలుష్య నియంత్రణకు వినియోగించనుంది. హైబ్రీడ్, ఎలక్ట్రిక్‌ వాహనాలు, సీఎన్‌జీ, ఈథనాల్‌ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచేవి, వ్యవసాయ రంగంలో ఉపయోగించే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు మొదలైన వాటికి హరిత పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు