దివాలా కంపెనీలు 421.. కేసుల విలువ రూ. 2.55 లక్షల కోట్లు

8 Dec, 2021 08:03 IST|Sakshi

సెప్టెంబర్‌ వరకూ 421 దివాలా కేసుల పరిష్కారం 

న్యూఢిల్లీ: దివాలా చట్టం (ఐబీసీ) కింద సెప్టెంబర్‌ నాటికి 421 కేసులు పరిష్కారం అయినట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో తెలిపారు. ఇలా పరిష్కారమైన కేసుల విలువ దాదాపు రూ.2.55 లక్షల కోట్లని వెల్లడించారు. ఇక దాదాపు రూ.52,036 కోట్ల విలువైన  1,149 కేసులు లిక్విడిటీ పక్రియకు వెళ్లినట్లు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. సెప్టెంబర్‌ 30వ తేదీనాటికి ఐబీసీ కింద మొత్తం 4,708 కార్పొరేట్‌ దివాలా పరిష్కార పక్రియను (సీఐఆర్‌పీ) ప్రారంభించినట్లు తెలిపారు. దివాలా అంశంతో పాటు మరిన్ని విషయాలపై  పార్లమెంటులో నిర్మలా సీతారామన్‌ వివరణ ఇచ్చారు.

బ్యాంకుల విశ్వసనీయ నిర్ణయాలకు భరోసా! 
బ్యాంకుల విశ్వసనీయ వాణిజ్య నిర్ణయాల విషయంలో అధికారులకు ఎటువంటి ఇబ్బందీ ఉండబోదని ఆర్థికశాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటున్నట్లు రాజ్యసభలో  తెలిపారు. అవినీతి నిరోధక చట్టం (పీసీ చట్టం) 1988కు సవరణలు, ప్రభుత్వ ఉద్యోగిపై దర్యాప్తు ప్రారంభించే ముందు ముందస్తు అనుమతి ఆవశ్యకత, బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మోసాలపై మొదటి స్థాయి పరిశీలన కోసం బ్యాంకింగ్‌– ఆర్థిక విభాగ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు, కన్సాలిడేటెడ్‌ స్టాఫ్‌ అకౌంటబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌ ఖరారు వంటి అంశాలు కేంద్రం తీసుకున్న చర్యల్లో ఉన్నట్లు వెల్లడించారు. 

స్టాఫ్‌ అకౌంటబిలిటీ కీలక పాత్ర... 
కేంద్రం తీసుకువచ్చిన విధానాల్లో స్టాఫ్‌ అకౌంటబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌ కీలకమైనదని మంత్రి  తెలిపారు. రూ.50 కోట్ల వరకు నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ) ఖాతాల విషయంలో చర్యలకు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌తో సంప్రదింపులు జరిపి ఇటీవల కేంద్రం ఏకీకృత స్టాఫ్‌ అకౌంటబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేసినట్లు ఆమె తెలిపారు.  ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) తమ బోర్డుల ఆమోదంతో ఈ ఫ్రేమ్‌వర్క్‌కు తగిన విధంగా తమ స్టాఫ్‌ అకౌంటబిలిటీ పాలసీ, సంబంధిత ఇతర విధానాలను రూపొందించుకోవచ్చని ఆర్థికమంత్రి సూచించారు.  ‘ఒకవైపు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తూ మరోవైపు బ్యాంకు అధికారులు, ఉద్యోగుల తీసుకునే విశ్వసనీయ నిర్ణయాలను రక్షించడం లక్ష్యంగా స్టాఫ్‌ అకౌంటబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌ రూపొందింది. ఇది బ్యాంకు అధికారులు, ఉద్యోగుల ఉద్దేశ్యపూర్వక తప్పులను గుర్తించి, ఇందుకు బాధ్యులైన వారిని మాత్రమే శిక్షించడానికి ఉద్దేశించింది. నిర్దేశించిన వ్యవస్థలు,  విధానాలకు అనుగుణంగా లేకపోవటం లేదా దుష్ప్రవర్తన లేదా ’నిర్ధారిత’ నిబంధనలకు కట్టుబడి ఉండకపోవడం వంటి అంశాలపై చర్యలు తప్పవు’’ అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. 2022 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మొండిబకాయిలుగా వర్గీకరించిన అకౌంట్లకు వర్తించేలా ఫ్రేమ్‌వర్క్‌ అమలులోకి వస్తుందని వివరించారు.  

ఎస్‌యూఐ పథకానికి ప్రాధాన్యత 
స్టాండ్‌ అప్‌ ఇండియా (ఎస్‌యూఐ) పథకానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరో ప్రశ్నకు ఆర్థికమంత్రి తెలిపారు. 2021 నవంబర్‌ 30 వరకు దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల ద్వారా స్టాండ్‌ అప్‌ ఇండియా పథకం కింద మొత్తం 1,25,575 రుణాలు మంజూరయినట్లు వెల్లడించారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 13,092 మంది లబ్దిదారులకు రూ.940 కోట్లు మంజూరయినట్లు వెల్లడించారు. ఈ పథకం కింద గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లో కనీసం ఒక ఎస్‌సీ, ఎస్‌టీ రుణగ్రహీతకు, ఒక మహిళ రుణగ్రహీతకు రూ. 10 లక్షల నుండి రూ. 1 కోటి మధ్య రుణాలను అందించాల్సి ఉంటుంది.   షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల ప్రజలను అలాగే మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకుగాను ఈ పథకం కిందకు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న కార్యకలాపాలను చేర్చడం,  మార్జిన్‌ మనీ అవసరాన్ని 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడం వంటి చర్యలను కేంద్రం చేపట్టింది.   

చదవండి: దేశ ఆర్థిక వ్యవస్థపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు