ఓయోలో ఉద్యోగులకు వాటా

4 Jan, 2022 04:44 IST|Sakshi

3 కోట్ల షేర్లు కొనుగోలు చేసిన సిబ్బంది

500కుపైగా ప్రస్తుత ఉద్యోగులు, మాజీలు

వాటాల విలువ రూ. 330 కోట్లు!

సిబ్బందికి భారీ డిస్కౌంట్‌తో షేర్లు

న్యూఢిల్లీ: వినియోగదారులకు హోటల్‌ రూములను సమకూర్చే ఆతిథ్య రంగ కంపెనీ ఓయో.. ఉద్యోగులకు షేర్లను జారీ చేసింది. కంపెనీ ప్రస్తుత సిబ్బందిసహా మాజీ ఉద్యోగులు సైతం షేర్లను సొంతం చేసుకున్నట్లు ఓయో తాజాగా తెలియజేసింది. ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్‌(ఇసాప్‌)లో భాగంగా 3 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఓయో మాతృ సంస్థ ఒరావెల్‌ స్టేస్‌ లిమిటెడ్‌ పేర్కొంది. ఇసాప్‌ల మార్పిడి ద్వారా ఉద్యోగులు ఈక్విటీ షేర్లను పొందినట్లు వెల్లడించింది.

కంపెనీ భారీ డిస్కౌంట్‌లో జారీ చేసిన ఇసాప్‌ల ద్వారా సిబ్బంది షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. కంపెనీ గతేడాది ఆగస్ట్‌లో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ నుంచి 5 మిలియన్‌ డాలర్లను సమీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఓయో విలువ 9.6 బిలియన్‌ డాలర్లకు చేరింది. వెరసి ఉద్యోగులు కొనుగోలు చేసిన షేర్ల విలువను రూ. 330 కోట్లుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ ఇటీవల ఇసాప్‌ల జారీని 41 శాతానికి విస్తరించడంతో ప్రస్తుత సిబ్బందిలో 80 శాతం మందికి ఇవి లభించినట్లు తెలుస్తోంది.

2021 మార్చికల్లా ప్రపంచవ్యాప్తంగా కంపెనీ సిబ్బంది సంఖ్య 5,130కు చేరింది. వీరిలో దాదాపు 71 శాతం మంది దేశీయంగానే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం! గతేడాది అక్టోబర్‌లో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా కంపెనీ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన విషయం విదితమే. తద్వారా రూ. 8,430 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 7,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ. 1,430 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది.

మరిన్ని వార్తలు