3రోజుల్లో.. 70 మంది కోటీశ్వరులయ్యారు

21 Oct, 2020 10:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించిన బిగ్‌ బిలయన్‌ డే సేల్‌లో భారీగా ఆర్డర్లు నమోదయ్యాయి. దసరా, దీపావళి పండుగలకు ముందు భారీ ఆఫర్లు, తగ్గింపు ధరలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక అమ్మకాల కార్యక్రమాలను ఈనెల 16 నుంచి చేపట్టిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌ ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు ‘బిగ్‌ బిలియన్‌ డే సేల్‌‌’ పేరుతో అమ్మక కార్యక్రమం చేపట్టింది. అయితే ఇది మొదలైన మూడు రోజుల్లోనే 70 మంది అమ్మకందారులు కోటీశ్వరులైనట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. అలానే మరో 10 వేల మంది అమ్మకందారులు లక్షాధికారులు అయినట్లు వెల్లడించింది. బిజినెస్‌ స్టాండర్డ్‌ నివేదిక ప్రకారం బిగ్‌బిలియన్‌ డే సేల్‌‌ మూడు రోజుల్లో ప్లాట్‌ఫామ్‌లోని అమ్మకందారులకు మంచి బిజినెస్‌ లభించింది. ఇక మొదటి మూడు రోజుల్లో తన వేదికపై 3 లక్షలకు పైగా విక్రేతలకు ఆర్డర్లు లభించినట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఈ ఆర్డర్లలో 60 శాతం టైర్‌–2 (ద్వితీయ శ్రేణి), అంతకంటే చిన్న పట్టణాలవే ఉన్నట్టు పేర్కొంది. (చదవండి: 12 గంటల్లో 1.75 లక్షల ఫోన్ల అమ్మకం)

''ఈ ఏడాది విక్రయదారుల సంఖ్య 20శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా 3,000కు పైగా పిన్‌కోడ్‌లకు సేవలు అందిస్తున్నాము. 2020 బిగ్‌ బిలియన్‌డేస్‌ తొలి రెండు రోజుల్లో విక్రేతలు.. 2019 బిగ్‌బిలియన్‌ డేస్‌ కార్యక్రమంలో ఏడు రోజుల విక్రయాలను మించి వృద్ధిని చూశారు’’ అని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. తొలి 3 రోజుల్లో  ఈఎంఐ, ఫ్లిప్‌కార్ట్‌ పేలేటర్‌ ద్వారా కస్టమర్లు చేసిన ఖర్చు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఈ ఏడాది అత్యవసరమైన ఉత్పత్తులకు భారీగా డిమాండ్‌ ఏ‍ర్పడిందని.. ముఖ్యంగా గృహోపకరణాలు, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించి ఎక్కువ ఆర్డర్లు లభించాయని తెలిపింది. అలానే సాధారణ రోజుల్లో పోల్చితే పండగ సీజన్‌లో డిజిటల్‌ చెల్లింపులు లావాదేవీలు 60 శాతం పెరిగాయన్నది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఎక్కువ మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌కు మొగ్గు చూపారు. దాంతో అమ్మకాలు భారీగా జరిగాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు