ఎలన్‌ మస్క్‌కు చుక్కలు చూపిస్తున్న మాజీ ఉద్యోగులు

9 Dec, 2022 09:58 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: టెస్లా, ట్విటర్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ట్విటర్‌ సంస్థ నుంచి ఉద్యోగాల తొలగింపు నేపథ్యంలో ఆయన్ని కోర్టుకు లాగాలని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో..

ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ బాధ్యతలు చేపట్టాక..  సగం మంది ఉద్యోగులను(సుమారు 7,500 మందిని)  సంస్థ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాపార దిగ్గజాన్ని కోర్టుకు ఇచ్చేందుకు వాళ్లంతా యత్నిస్తున్నారు. ఇప్పటికే శాన్‌ ఫ్రాన్సిస్కో కోర్టులో వందల సంఖ్యలో దావాలు దాఖలు అయ్యాయి. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఒక అంచనా. అంతేగాక.. ఆఫీస్‌లోనే పడుకోవాలంటూ బెడ్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తుండడంపైనా కోర్టుకు ప్రైవేట్‌ ఫిర్యాదులు అందుతున్నాయి. 

ప్రపంచంలోనే అత్యధిక ధనికుడైన ఎలన్‌ మస్క్‌.. ఉద్యోగుల హక్కుల్ని కాలరాసేయడంతో పాటు చట్టాన్ని అనుసరించకపోవడం దారుణమని లాయర్‌ షాన్నోన్‌ లిస్‌ రియోర్డన్‌ పేర్కొంటున్నారు. ట్విటర్‌ నుంచి ఉద్వాసన తర్వాత.. వాళ్లకు అందాల్సిన ప్రతిఫలాలు అందకపోవడంతో..  షాన్నోన్‌ ద్వారా దావా వేయించారు కొందరు మాజీ ఉద్యోగులు. చట్టమైన పోరాటం ఎలన్‌ మస్క్‌కు కొత్తేం కాదు. కానీ, ఇలా వందల సంఖ్యలో దావాలు దాఖలు అవుతుండడంపై కాస్త ఉత్కంఠ నెలకొంది.

  

మరిన్ని వార్తలు