మల్టీబ్యాగర్‌ కంపెనీలను గుర్తించే స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌

12 Jul, 2021 11:55 IST|Sakshi

స్మాల్‌క్యాప్‌లో మెరుగైన పనితీరు 

నిప్పన్‌ ఇండియా స్మాల్‌క్యాప్‌ ఫండ్‌  

స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో స్వల్ప కాలంలో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. కానీ, దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించగలిగే వీలుంటే ఈ పథకాలు అద్భుతమైన రాబడులతో ఇన్వెస్టర్లకు సంపద తెచ్చిపెడతాయనడంలో సందేహం అక్కర్లేదు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రాబడుల గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని దీర్ఘకాలం కోసం స్మాల్‌క్యాప్‌ పథకాలకు కేటాయించుకోవడం ద్వారా మెరుగైన రాబడులు వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. స్మాల్‌క్యాప్‌ విభాగంలో దీర్ఘకాలంలో అద్భుతమైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో నిప్పన్‌ ఇండియా స్మాల్‌క్యాప్‌ (గతంలో రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌) పథకం ఒకటి.  

రాబడులు 
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.15వేల కోట్లకు పైనే ఇన్వెస్టర్ల పెట్టుబడులున్నాయి. ఒక స్మాల్‌క్యాప్‌ పథకం ఈ స్థాయిలో పెట్టుబడులను నిర్వహించడం అంత తేలికైన విషయం కానేకాదు. అయినప్పటికీ ఈ ఫండ్‌ నిర్వహణ బృందం తమ పనితీరుతో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూనే ఉంది. గడిచిన ఏడాది కాలంలో 107 శాతంగా ఉన్నాయి. అంటే పెట్టుబడులను ఏడాది కాలంలో రెట్టింపు చేసింది. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడులు 21 శాతంగా, ఏడేళ్ల కాలంలో 22 శాతం, పదేళ్ల కాలంలోనూ 22 శాతం చొప్పున సగటు వార్షిక ప్రతిఫలాన్ని ఈ పథకం తెచ్చిపెట్టింది. నిఫ్టీ 250 టీఆర్‌ఐ రాబడులతో ఈ పథకం రాబడులను ప్రామాణికంగా పోల్చి చూసుకోవచ్చు. సూచీతో పోలిస్తే ఈ పథకమే 5 శాతానికి పైగా అధిక రాబడులను ఇస్తోంది. రూ.5,000 కోట్ల వరకు మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీలు స్మాల్‌క్యాప్‌ కిందకు వస్తాయి. అధిక రిస్క్‌ తీసుకునే వారికి ఈ విభాగం చక్కగా సరిపోతుంది. ఈ పథకంలో ఉన్న మరో వెసులుబాటు సిప్‌ ద్వారా ప్రతీ నెలా రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. కనీసం రూ.100 నుంచి వెనక్కి తీసుకునే విధంగా సిస్టమ్యాటిక్‌ విత్‌ డ్రాయల్‌ ఆప్షన్‌ (ఎస్‌డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. 

పెట్టుబడుల విధానం.. 
స్మాల్‌ క్యాప్‌ పథకం కనుక పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని చిన్న కంపెనీలకే కేటాయిస్తుంది. అదే సమయంలో మిడ్‌క్యాప్‌ కంపెనీలకూ చెప్పుకోతగ్గ పెట్టుబడులను కేటాయించడం ద్వారా రిస్క్‌ను కొంత తగ్గించే విధానాన్ని ఫండ్‌ మేనేజర్లు అనుసరిస్తున్నారు. భవిష్యత్తులో మల్టీబ్యాగర్‌ కాగల కంపెనీలను గుర్తించడంలో ఈ పథకానికి మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. గతంలో ఈ పథకం ఎంచుకున్న కంపెనీల్లో చాలా వరకు తర్వాతి కాలంలో మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌ కంపెనీలుగా మారినవే ఉన్నాయి. ప్రస్తుతం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 98 శాతాన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయగా, మిగిలిన రెండు శాతం మేర నిధులను నగదు, నగదు సమాన రూపాల్లో కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను పరిశీలిస్తే.. స్మాల్‌క్యాప్‌ కంపెనీలకు 55 శాతం, మిడ్‌క్యాప్‌ కంపెనీలకు 38 శాతం, మెగా, లార్జ్‌క్యాప్‌ కంపెనీలకు 7 శాతం వరకు కేటాయింపులు చేసింది. ఇంజనీరింగ్, కెమికల్స్, ఫైనాన్షియల్స్, ఎఫ్‌ఎంసీజీ, టెక్నాలజీ, సేవలరంగ కంపెనీలకు పోర్ట్‌ఫోలియోలో ప్రాధాన్యం ఇచ్చింది. ఈ పథకం నిర్వహణలో 123 స్టాక్స్‌ ఉన్నాయి. రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది కనుక స్మాల్‌క్యాప్‌ పథకాలు ఏకమొత్తంలో పెట్టుబడులకు ప్రస్తుత తరుణంలో అనుకూలం కాదు. దీర్ఘకాలం కోసం ప్రతీ నెలా సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో కొంత చొప్పున ఇన్వెస్ట్‌ చేసుకోవడం రిస్క్‌ కోణంలో నుంచి చూస్తే అనుకూలంగా ఉంటుంది. 

టాప్‌ ఈక్విటీ హోల్డింగ్స్‌ 
కంపెనీ                               పెట్టుబడుల శాతం 
దీపక్‌ నైట్రేట్‌                          3.76 
నవీన్‌ ఫ్లోరిన్‌                            2.71 
ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌             2.51 
బలరామ్‌పూర్‌ చినీ                  2.30 
బిర్లా కార్పొరేషన్‌                      2.25 
బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌                  2.23 
ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌                 2.19 
రాడికో ఖైతాన్‌                          1.88 
డిక్సన్‌ టెక్నాలజీస్‌                 1.79 
నిట్‌                                        1.79   
 

మరిన్ని వార్తలు