ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్: పొరపాటుతో ఖుషీ!

26 Nov, 2020 13:30 IST|Sakshi

తయారీ పొరపాటు- ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ వెల్లడి

హాఫ్‌డోసేజీ వినియోగంతో మరింత సత్ఫలితాలు

బ్రెజిల్‌లో రెండు పూర్తి డోసేజీలతో ప్రయోగాలు

బ్రిటన్‌లో ఒకటిన్నర డోసేజీలతో క్లినికల్ పరీక్షలు

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ కట్టికి బ్రిటిష్‌, స్వీడిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ తయారీలో పొరపాటు దొర్లినట్లు తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పేర్కొంది. దీంతో బ్రిటన్‌లో ఒకటిన్నర డోసేజీలతోనే మూడో దశ క్లినికల్ పరీక్షలను నిర్వహించినట్లు తెలుస్తోంది. కోవిడ్‌-19 నిలువరించేందుకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం విదితమే. దీనిలో భాగంగా మూడో దశ క్లినికల్‌ పరీక్షలలో భాగంగా బ్రెజిల్‌లో రెండు పూర్తి డోసేజీలతో 8,895 మందిపై ప్రయోగాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదే విధంగా బ్రిటన్‌లో ఒకటిన్నర డోసేజీలతో 2,781పై పరిశీలించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇటీవలే ఈ వ్యాక్సిన్‌ 70 శాతం ఫలితాలను ఇచ్చినట్లు ఆస్ట్రాజెనెకా తెలియజేసింది. మూడో దశ క్లినికల్‌ పరీక్షల ప్రాథమిక డేటా ప్రకారం తక్కువ డోసేజీ ఇచ్చిన కేసులలో మరింత అధికంగా 90 శాతం ఫలితాలు నమోదైనట్లు మరోసారి వెల్లడించింది. అయితే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ తాజా ప్రకటనతో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ప్రమాణాలపై సందేహాలు తలెత్తే అవకాశమున్నట్లు ఫార్మా రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. 

తక్కువ డోసేజీలో
ఒకటిన్నర డోసేజీ పరీక్షలలో వ్యాక్సిన్‌ 90 శాతం విజయవంతంగా పనిచేసినట్లు ఆస్ట్రాజెనెకా చెబుతోంది. నిజానికి ఈ పొరపాటు అటు కంపెనీకి, ఇటు ప్రజలకూ ఒక విధంగా మేలు చేసే విషయమేనని ఫార్మా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా.. లోయర్‌ డోసేజీవల్ల రోగనిరోధక శక్తిని పెంచే టీసెల్స్‌ మరింత సమర్థవంతంగా పనిచేసి ఉండవచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు. ఈ రెండు ప్రయోగాలలోనూ పలు ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకోవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌‌ మూడో దశలో భాగంగా జపాన్, రష్యా, దక్షిణాఫ్రికాసహా పలు ఇతర దేశాలలోనూ క్లినికల్‌ పరీక్షలు కొనసాగుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. రెండు పూర్తి డోసేజీలతో భారీ సంఖ్యలో చేపట్టిన ఫలితాలను పూర్తిగా విశ్లేషించవలసి ఉన్నట్లు ఈ సందర్భంగా ఫార్మా నిపుణులు తెలియజేశారు.

>
మరిన్ని వార్తలు