2 డోసుల వ్యాక్సిన్‌ రూ. 1,000కే!

20 Nov, 2020 11:58 IST|Sakshi

2021 ఏప్రిల్‌కల్లా అందరికీ అందుబాటులో

2024కల్లా దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌

ఫిబ్రవరి నుంచి నెలకు 10 కోట్ల డోసేజీల తయారీ

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ సురక్షితం, ప్రభావవంతం

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో పూనావాలా వెల్లడి

ముంబై, సాక్షి: వచ్చే ఏడాది ఏప్రిల్‌కల్లా ఆక్సఫర్డ్‌ వ్యాక్సిన్‌ దేశీయంగా అందరికీ అందుబాటులోకి రాగలదని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదార్‌ పూనావాలా పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరికల్లా తొలుత ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్న కార్యకర్తలకు అందించనున్నట్లు హిందుస్తాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సదస్సులో పూనావాలా తెలియజేశారు. ఏప్రిల్‌ నుంచి సాధారణ ప్రజలందరికి విక్రయించే వీలున్నట్లు వివరించారు. నియంత్రణ సంస్థల అనుమతులు, తుది క్లినికల్‌ పరీక్షల ఫలితాలు ఆధారంగా రెండు డోసేజీల ఈ వ్యాక్సిన్‌ గరిష్టంగా రూ. 1,000 ధరలోనే లభించే వీలున్నట్లు తెలియజేశారు. వెరసి 2024కల్లా దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రధానంగా సరఫరా సమస్యలు, బడ్జెట్‌, లాజిస్టిక్స్‌, మౌలిక సదుపాయాలు, ప్రజల ఆసక్తి వంటి అంశాలు ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు. ఈ అంశాల నేపథ్యంలో 2024కల్లా దేశంలోని 80-90 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్‌ లభించవచ్చని అంచనా వేశారు. వ్యాక్సిన్‌ తయారీపై ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకాతో ఇప్పటికే సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే.

కారు చౌకగా..
ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ధరపై స్పందిస్తూ.. 5-6 డాలర్ల స్థాయిలో వెలువడవచ్చని హెల్త్‌కేర్‌ రంగ దేశీ కంపెనీ సీరమ్‌ సీఈవో పూనావాలా చెప్పారు. దీంతో దేశీయంగా రెండు డోసుల వ్యాక్సిన్‌ రూ. 1,000 గరిష్ట ధరలో లభించవచ్చని తెలియజేశారు. నిజానికి దేశీ ప్రభుత్వం వ్యాక్సిన్లను భారీ పరిమాణంలో కొనుగోలు చేయనుండటంతో ఇంతకంటే తక్కువ ధరలోనూ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. అంటే 3-4 డాలర్లకు సైతం ప్రభుత్వం వ్యాక్సిన్లను సమకూర్చుకునే వీలున్నదని వివరించారు. ఇది కోవాక్స్‌ ధరలకు సమానమని చెప్పారు. నేడు వినిపిస్తున్న పలు ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కారు చౌకగా వ్యాక్సిన్లను అందించే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ పెద్దవయసు వారిలోనూ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు. యువతతోపాటు, వయసుమీరిన వారిలోనూ ఒకేస్థాయిలో టీసెల్స్‌, రోగనిరోధక శక్తి పెంపు వంటివి వ్యాక్సిన్‌ ద్వారా కనిపించినట్లు తెలియజేశారు.

అనుమతులు లభించాక
ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు యూకే, యూరోపియన్‌ ఔషధ నియంత్రణ సంస్థల నుంచి ఎమర్జెన్సీ అనుమతులు లభిస్తే.. దేశీయంగానూ వినియోగానికి దరఖాస్తు చేయనున్నట్లు పూనావాలా తెలియజేశారు. అయితే అత్యవసర అనుమతి ద్వారా హెల్త్‌కేర్‌ నిపుణులు, వర్కర్లు, సీనియర్‌ సిటిజన్లకు మాత్రమే వ్యాక్సిన్లను అందించే వీలున్నట్లు వివరించారు. ఈ వ్యాక్సిన్‌ను 2-8 సెల్షియస్‌లో భద్రపరచవచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరి నుంచి నెలకు 10 కోట్ల డోసేజీల తయారీపై దృష్టిపెట్టినట్లు తెలియజేశారు. దేశీయంగా జులైకల్లా 40 కోట్ల డోసేజీలు అవసరమవుతాయని అంచనా వేశారు. 

మరిన్ని వార్తలు