జోరుమీదున్న పీనోట్స్‌ పెట్టుబడులు

26 Nov, 2021 05:27 IST|Sakshi

అక్టోబర్‌ నాటికి రూ.1.02లక్షల కోట్లకు

2018 మార్చి తర్వాత గరిష్ట స్థాయి

న్యూఢిల్లీ: దేశీయ క్యాపిటల్‌ మార్కెట్లలో పి.నోట్స్‌ రూపంలోని పెట్టుబడులు భారీగా వృద్ధి చెందుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి ఈక్విటీ, డెట్, హైబ్రిడ్‌ సెక్యూరిటీల్లోని పి.నోట్స్‌ పెట్టుబడుల విలువ రూ.1.02 లక్షల కోట్లకు చేరింది. సెబీ వద్ద నమోదైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) పి.నోట్స్‌ జారీ చేస్తుంటారు. వీటి సాయంతో విదేశీ ఇన్వెస్టర్లు సెబీ వద్ద నేరుగా నమోదు కాకుండానే భారత మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. 2018 మార్చిలో పి.నోట్స్‌ పెట్టుబడుల విలువ రూ.1,06,403 కోట్లుగా ఉండగా, ఆ తర్వాత గరిష్ట స్థాయికి చేరడం మళ్లీ ఇదే మొదటిసారి.

అక్టోబర్‌లో పి.నోట్స్‌ రూపంలోని పెట్టుబడులు రూ.5,000కోట్లకు పైగా పెరగడం మొత్తం పెట్టుబడుల విలువ ఇతోధికం అయ్యేందుకు సాయపడినట్టు పీఎంఎస్‌ సంస్థ ‘పైపర్‌ సెరికా’ ఫండ్‌ మేనేజర్‌ అభయ్‌ అగర్వాల్‌ తెలిపారు. ‘‘ఆసక్తికరంగా ఈక్విటీల్లోని పి.నోట్స్‌ పెట్టుబడుల విలువ అక్టోబర్‌లో రూ.7,000 కోట్ల మేర పెరగ్గా.. డెట్‌ పెట్టుబడుల విలువ రూ.2,000 కోట్ల మేర తగ్గింది. అయితే, ఇదేమీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే దీర్ఘకాలిక వడ్డీ రేట్లు కనిష్టాలకు చేరుకోగా, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో 2022లో ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచక తప్పదు’’ అని అగర్వాల్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి పి.నోట్స్‌ పెట్టుబడుల విలువ రూ.97,751 కోట్లుగా ఉంటే, ఆగస్ట్‌ చివరికి రూ.97,744 కోట్లుగాను, జూలైలో రూ.85,799 కోట్ల చొప్పున ఉంది. ఎఫ్‌పీఐల నిర్వహణలోని ఆస్తులు అక్టోబర్‌ చివరికి రూ.53.60 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం.

మరిన్ని వార్తలు