Chand Nawab: జర్నలిస్ట్‌ ఫ్రస్టేషన్ వీడియో.. ఇప్పుడు లక్షలు కుమ్మరిస్తోంది

2 Sep, 2021 11:17 IST|Sakshi

Chand Nawab Karachi Se: కోపధారి మనిషి.. ఈ వీడియో గురించి బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే చాలాకాలం క్రితమే ఈ తరహా యాటిట్యూడ్‌తో పాకిస్తాన్‌లోనూ ఓ రిప్టోరర్‌ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ‘చాంద్‌ నవాబ్‌.. కరాచీ సే..’ అంటూ వార్తల కవరేజ్‌కి విఫలయత్నం చేసిన పాక్‌ జర్నలిస్ట్‌ గుర్తున్నాడు కదా!. ఆ జర్నలిస్ట్‌ సాబ్‌.. ఇప్పుడు జాక్‌పాట్‌ కొట్టేశాడు. ఈ వైరల్‌ వీడియోను నాన్‌ ఫంగిబుల్‌ టోకెన్‌(ఎన్‌ఎఫ్‌టీ) కింద వేలం వేయబోతున్నారు. 


జర్నలిస్ట్‌ చాంద్‌ నవాబ్‌.. పాక్‌లోనే కాదు ఇండియాలో.. ఆ మాటకొస్తే ప్రపంచం మొత్తం పాపులర్‌ అయ్యారు. సల్మాన్‌ ఖాన్‌ భజరంగీ భాయీజాన్‌(2015)లో ఈయన క్యారెక్టర్‌ను బేస్‌ చేసుకుని ఓ స్ఫూఫ్‌ వీడియో కూడా ఉంటుంది. ఆ క్యారెక్టర్‌ని నవాజుద్దీన్‌ సిద్ధిఖీ అద్భుతంగా పోషించాడు కూడా. సుమారు 12 ఏళ్ల క్రితం వైరల్‌ అయిన ఆ వీడియోను.. ఇప్పుడు ఎన్‌ఎఫ్‌టీ నుంచి ఫౌండేషన్‌ యాప్‌ ద్వారా వేలం వేయబోతున్నారు. ఇంతకీ ప్రారంభ బిడ్‌ ఎంతో తెలుసా? 

ఒత్తిడిలోనే అలా చేశా
డిజిటల్‌ ఆక్షన్‌ ప్లాట్‌ఫామ్‌ మీద స్వయంగా చాంద్‌ నవాబ్‌.. ఓ ప్రకటన రిలీజ్‌ చేశాడు. ‘‘నేను చాంద్‌ నవాబ్‌ని. వృత్తిరీత్యా జర్నలిస్ట్‌/రిపోర్టర్‌ని. 2008లో నా వీడియో ఒకటి యూట్యూబ్‌ ద్వారా విపరీతంగా వైరల్‌ అయ్యింది. పండుగ పూట రైల్వే స్టేషన్‌లో కవరేజ్‌ చేస్తుండగా.. ప్రయాణికులు అడ్డురావడంతో నాకు విసుగొచ్చింది. జర్నలిజంలో ఉన్న ఒత్తిడి గురించి బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ ఫ్రస్టేషన్‌లోనే అలా ప్రవర్తించా. అయితే ఆ వీడియో నన్ను మీకు పరిచయం చేసింది. నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. నా క్యారెక్టర్‌ స్ఫూర్తితోనే కబీర్‌ఖాన్‌ డైరెక్షన్‌లో వచ్చిన భజరంగీ భాయీజాన్ సినిమాలో నవాజుద్దీన్‌ క్యారెక్టర్‌ డిజైన్‌ చేశారు. ఆ క్యారెక్టర్‌ ద్వారా నన్ను మరోసారి వైరల్‌ చేశారు. నాపై అభిమానం చూపిన వాళ్లందరికీ థ్యాంక్స్‌’ అంటూ పేర్కొన్నాడు కరాచీకి చెందిన చాంద్‌ నవాబ్‌. ఇక ఈ వీడియోను ప్రారంభ బిడ్‌ ధర అక్షరాల 46 లక్షల రూపాయలు(63వేల డాలర్లు)గా నిర్ణయించింది ఎన్‌ఎఫ్‌టీ ఫౌండేషన్‌. మరి ఇది ఎంతకు అమ్ముడు పోతుందో, చాంద్‌ నవాబ్‌కు ఎంత లాభం తెచ్చిపెడుతుందో చూడాలి మరి.
 

ఎన్‌ఎఫ్‌టీ అంటే
బ్యాంకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా డిజిటల్‌ మార్కెట్‌లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా కొనసాగుతోంది. బిట్‌ కాయిన్‌, డిగో కాయిన్‌, ఈథర్‌నెట్‌ వంటి క్రిప్టో కరెన్సీలు డబ్బుకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్‌ వర్క్‌ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్‌ ఎస్సెట్స్‌, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్‌ చైయిన్‌ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు.

క్లిక్‌ చేయండి: ఎన్‌ఎఫ్‌టీ.. తొలి హీరో ఎవరో తెలుసా?

మరిన్ని వార్తలు