వార్నింగ్ ఇచ్చిన తాలిబన్లు​.. దీటుగా బదులిచ్చిన పాక్​

15 Oct, 2021 08:51 IST|Sakshi

ఆఫ్ఘనిస్తాన్​ మిత్రరాజ్యంగా ఉన్న పాకిస్థాన్​.. ఇప్పుడు పెద్ద షాక్​ ఇచ్చింది. తాలిబన్ల అతిజోక్యంతో విసుగొచ్చి.. అఫ్గన్​కు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ధరల్ని తగ్గించే ప్రసక్తే లేదని పేర్కొంటూ.. ఈ మేరకు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. దీంతో అఫ్గన్​కు ప్రస్తుతం నడుస్తున్న ఏకైక విదేశీ విమాన సర్వీస్​ కూడా నిలిచిపోయినట్లు అయ్యింది.
 

కారణం.. తాలిబన్ల దురాక్రమణకు ముందు(ఆగస్టు 15 వరకు) కాబూల్-ఇస్లామాబాద్ మధ్య విమాన ఛార్జీ టికెట్ ధర 120-150 డాలర్ల మధ్య ఉండేది. కానీ ఇప్పుడది 2500 డాలర్లకు చేరుకుని మంటపుట్టిస్తోంది. ఈ తరుణంలో టికెట్ ధరల్ని తగ్గించాలని, లేదంటే విమాన సర్వీసులను నిలిపివేస్తామని తాలిబన్ ప్రభుత్వం పాక్​ను హెచ్చరించింది. ఇందుకు కౌంటర్​గానే పాక్ తన​ సర్వీసులు నిలిపివేసి తాలిబన్లకు ధీటుగా బదులిచ్చింది.
 
తమ సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నా.. తాలిబన్లను ఇంతకాలం ఓపికగా భరిస్తూ వస్తున్నామని చెబుతోంది పీఐఏ. అయితే ఇప్పుడు మునుపటి ధరలతో విమాన సర్వీసులు నడపాలన్నది తాలిబన్ల తాజా ఆదేశం. కానీ, బీమా సంస్థలు కాబూల్‌ను యుద్ధ ప్రాంతంగా పరిగణిస్తున్నందున బీమా ప్రీమియం ధరలు భారీగా పెరిగాయని, అందుకనే టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని పాక్​ చెబుతోంది. ఇంతకాలం తాము మానవతా దృక్పత కోణంలోనే విమాన సర్వీసులు నడిపామని, కానీ, ఇక మీదట టికెట్ ధరలను తగ్గించలేమని పేర్కొంటూ అఫ్గనిస్తాన్​కు విమాన సర్వీసులను రద్దు చేసింది పీఐఏ.

చదవండి: పాక్‌ జిమ్మిక్కు.. తాలిబన్లకే టోకరా!

మరిన్ని వార్తలు