కిలో ఉల్లి 220,  కిలో చికెన్‌ 383, మరి బియ్యం? 

10 Jan, 2023 21:25 IST|Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది.  ఒక వైపు రుణ సంక్షోభం,  రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, మరోవైపు తరిగి పోతున్న విదేశీ నిల్వలతో  మరింత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది.  దీంతో నిత్యావసరాల ధరలు చుక్కల్నంటుతున్నాయి. గోధుమ పిండి కొరతతో  పాటు, బియ్యం, పాలు చమురు ధరలు 40-50 శాతంపెరిగాయి.  దీంతో అక్కడి ప్రజల బాధలు అన్నీ ఇన్నీ కావు. (తీవ్ర ఆర్థిక సంక్షోభం: ఆహారం కోసం జనం పాట్లు, వైరల్‌ వీడియోలు)

గత ఏడాది 36 రూపాయలు ఉన్న కిలో ఉల్లి ధర  501 శాతం పెరిగి రూ. 220 గా ఉంది. చికెన్  కిలో రూ.210 నుంచి రూ.383కి,  పప్పుధాన్యం దాదాపు రూ.151 నుంచి రూ.228కి ఎగబాకాయి.  తాజా లెక్కల ప్రకారం ఒక కిలో బాస్మతి బియ్యం 46 శాతం పెరిగి రూ.146 పలుకుతోంది. పాల ధరలు 30 శాతం పెరిగి దాదాపు రూ. 150కి చేరుకున్నాయి.

2022 డిసెంబరులో  పాక్‌ ద్రవ్యోల్బణం 24.5 శాతానికి చేరుకుంది. ఇది భారతదేశం కంటే దాదాపు నాలుగు రెట్లు. అలాగే విదేశీ నిల్వలు ఎనిమిదేళ్ల కనిష్టం 5.576 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఇది కేవలం మూడు వారాల దిగుమతులకు సరిపోతుంది. ఫలితంగా చమురును దిగుమతి చేసు కోవడానికి తగినంత నిల్వలు లేనందున ఇంధనాన్ని ఆదా చేయడానికి మార్కెట్లు, హాళ్లను త్వరగా మూసివేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించవలసి వచ్చింది.

విదేశీ రుణాలను చెల్లించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 13 బిలియన్ డాలర్లు అవసరం. ప్రపంచ బ్యాంక్ వార్షిక రుణ నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరం నాటికి పాకిస్థాన్ 33 బిలియన్ డాలర్ల అప్పులు చెల్లించాలి.అయితే ప్రస్తుతం 20 బిలియన్ డాలర్లు ఖాతాలో ఉన్నాయని,  2023 జూన్‌ నాటికి దేశానికి ఇంకా 13 బిలియన్‌ డాలర్లు అవసరమని గత నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్  చెప్పారు.

కాగా పాకిస్తాన్‌ పలు ప్రాంతాల్లో ప్రజలు  గోధుమ పిండి కొరతను ఎదుర్కొంటున్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా  సింధ్ ప్రావిన్స్‌ల వంటి అనేక ప్రాంతాల్లో తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. సింధ్‌లో, షహీద్ బెనజీరాబాద్‌లోని సక్రంద్ పట్టణంలోని ఒక పిండి మిల్లు వెలుపల జరిగిన తొక్కిసలాట, ఘర్షణలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు.  

మరిన్ని వార్తలు