పాన్‌–ఆధార్‌ గడువు మరో 3 నెలలు

1 Apr, 2021 04:51 IST|Sakshi

జూన్‌ 30 దాకా డెడ్‌లైన్‌ పెంపు

‘వివాద్‌ సే విశ్వాస్‌’ స్కీమ్‌ ముగింపు

న్యూఢిల్లీ: పర్మనెంట్‌ అకౌంట్‌ నంబరు (పాన్‌)తో ఆధార్‌ను అనుసంధానించేందుకు నిర్దేశించిన డెడ్‌లైన్‌ను కేంద్రం మూడు నెలల పాటు పొడిగించింది. జూన్‌ 30 దాకా దీన్ని పెంచుతున్నట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్‌ మహమ్మారి పరిణామాల నేపథ్యంలో ఆఖరు తేదీని పొడిగించాలంటూ పన్నుచెల్లింపుదారుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి దీనికి ముందుగా నిర్దేశించిన గడువు మార్చి 31. మరోవైపు, పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ‘వివాద్‌ సే విశ్వాస్‌ స్కీమ్‌’ గడువు మార్చి 31తో ముగిసింది.

వాస్తవానికి డిక్లరేషన్‌ దాఖలు చేయడానికి ఫిబ్రవరి 28, చెల్లింపులు జరిపేందుకు మార్చి 31 ఆఖరు తేదీలు. అయితే, ఆదాయ పన్ను శాఖ ఈ డెడ్‌లైన్‌లను గతంలో పొడిగించింది. దీని ప్రకారం డిక్లరేషన్ల దాఖలుకు మార్చి 31తో గడువు ముగిసింది. ఏప్రిల్‌ 30లోగా చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఈ స్కీము కింద ఫిబ్రవరి 22 దాకా సుమారు రూ. 98,328 కోట్ల విలువ చేసే పన్ను వివాదాలకు సంబంధించి 1.28 లక్షల డిక్లరేషన్లు దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ గత నెలలో లోక్‌సభకు తెలిపారు. దీని ద్వారా సుమారు రూ. 53,346 కోట్లు ఖజానాకు వచ్చాయి. గతేడాది ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం 50.95 కోట్ల పాన్‌ కార్డులు ఉండగా 32.71 కోట్ల పాన్‌ కార్డులను ఆధార్‌తో అనుసంధానించారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు