పాన్‌–ఆధార్‌ అనుసంధానానికి గడువు పెంపు

29 Mar, 2023 06:06 IST|Sakshi

జూన్‌ 30 వరకూ అవకాశం

న్యూఢిల్లీ: పాన్, ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు నిర్దేశించిన గడువును ప్రభుత్వం మరో మూడు నెలల పాటు జూన్‌ 30 వరకూ పొడిగించింది. వాస్తవానికి ఇది మార్చి 31తో ముగియాల్సి ఉంది. అయితే, ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేసుకునేందుకు ప్రజలకు మరింత సమయం ఇవ్వాలంటూ రాజకీయ పార్టీలు సహా పలు వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యాక్స్‌పేయర్లకు మరికాస్త సమయం ఇచ్చే క్రమంలో పాన్, ఆధార్‌ను లింక్‌ చేసుకునేందుకు గడువు తేదీని 2023 జూన్‌ 30 వరకు పెంచినట్లు ఆర్థిక శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

నిర్దేశిత గడువులోగా వీటిని లింకు చేసుకోని వారి పాన్‌ నంబర్లు జూలై 1 నుంచి పనిచేయవు. దీని వల్ల ట్యాక్స్‌పేయర్లు ట్యాక్స్‌ రీఫండ్‌లను గానీ వాటిపై వడ్డీలను గానీ క్లెయిమ్‌ చేసుకోవడానికి వీలుండదు. అలాగే వారికి టీడీఎస్, టీసీఎస్‌ భారం కూడా ఎక్కువగా ఉంటుంది. పాన్, ఆధార్‌ అనుసంధానానికి ప్రభుత్వం డెడ్‌లైన్‌ను పలు దఫాలు పొడిగిస్తూ వస్తోంది. వాస్తవానికి గతేడాది (2022) మార్చి ఆఖరు నాటికే పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకోవాలని తొలుత గడువు విధించారు. అది దాటాకా 2022 ఏప్రిల్‌ 1 నుంచి రూ. 500 జరిమానా ప్రతిపాదించారు. దాన్ని గతేడాది జూలై 1 నుంచి రూ. 1,000కి పెంచారు. ప్రస్తుతం ఇదే పెనాల్టీ అమలవుతోంది. ఇప్పటివరకు 51 కోట్ల పాన్‌లు (పర్మనెంట్‌ అకౌంటు నంబర్‌) ఆధార్‌తో అనుసంధానమయ్యాయి.

మరిన్ని వార్తలు