భారీ ట్రాన్సాక్షన్స్‌ చేస్తున్నారా? కొత్త రూల్స్‌ ఈ రోజు నుంచే

26 May, 2022 12:38 IST|Sakshi

సాక్షి, న్యూడిల్లీ:   సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ)  ఇటీవల జారీ చేసిన కొత్త నిబంధనలు నేటి (మే 26) నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం 20 లక్షలు  రూపాయలు అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలకు పాన్  లేదా  ఆధార్ తప్పనిసరిగా ఉండాలి.

మే 10 నాటి నోటిఫికేషన్‌లో ప్రకటించిన కొత్త నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేసినా, డిపాజిట్ చేసినా తన పాన్ నెంబర్ పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ నంబర్‌ను వెల్లడించాలి. ఇంతకుముందు, ఒకే రోజులో రూ 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసేటప్పుడు మాత్రమే  పాన్‌ నంబర్ అవసరం. కానీ నగదు డిపాజిట్ లేదా ఉపసంహరణకు వార్షిక పరిమితి లేదు.

కొత్త  నిబంధనలు
ఖాతాదారులు  ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులతోపాటు, కోఆపరేటీవ్ బ్యాంకుల్లో రూ.20 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ చేసినా కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. బ్యాంకులేదా పోస్ట్ ఆఫీసులో కరెంట్ ఖాతా క్యాష్ క్రెడిట్ అకౌంట్ ఓపెన్ చేసినా పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి. 

అంతేకాదు ఒకేసారి రూ.20 లక్షల ట్రాన్సాక్షన్ చేసినా, వేర్వేరు సందర్భాల్లో మొత్తం కలిపి రూ.20 లక్షల లావాదేవీలు జరిపినా పాన్‌ నెంబరును నమోదు చేయాలి. అయితే ఈ లావాదేవీలు జరిపే సందర్భంలో పాన్ నెంబర్, ఆధార్ నంబర్లను తీసుకునే వ్యక్తులు అవి సరైన వివరాలేనా కాదా అని నిర్థారించుకోవాలని సీబీడీటీ వెల్లడించింది.

ఏయే వ్యక్తులు పాన్ కార్డ్ కోసం అప్లై చేయాలో, ఎవరు పాన్ కార్డ్ వివరాలను వెల్లడించాలో సెక్షన్ 139ఏ  తెలుపుతుంది. అందుకే సీబీడీటీ రూ.20 లక్షల కన్నా ఎక్కువ లావాదేవీలకు పాన్ కార్డ్ లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఒకవేళ భారీ ఆర్థిక లావాదేవీలు జరిపే వారి దగ్గర పాన్ కార్డ్ లేకపోతే లావాదేవీ చేసే తేదీకి కనీసం 7 రోజుల ముందు పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సీబీడీటీ తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. లేదంటే  సంబంధిత లావాదేవీలకు ఆస్కారం ఉండదు. 

మరిన్ని వార్తలు