సంస్కరణలకు గుర్తింపు

1 Mar, 2023 04:13 IST|Sakshi

జీఎస్‌ఎంఏ అవార్డుపై కేంద్ర మంత్రి వైష్ణవ్‌

న్యూఢిల్లీ: జీఎస్‌ఎం అసోసియేషన్‌ (జీఎస్‌ఎంఏ) భారత్‌కు ‘గవర్నమెంట్‌ లీడర్‌షిప్‌ అవార్డ్‌ 2023’ ఇవ్వడం అన్నది దేశం చేపట్టిన టెలికం సంస్కరణలు, విధానాలకు గుర్తింపు అని టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్‌ అన్నారు. అంతర్జాతీయంగా 750 మొబైల్‌ ఆపరేటర్లు, 400 కంపెనీలతో కూడినదే జీఎస్‌ఎంఏ. ఏటా ఒక దేశానికి ఈ అసోసియేషన్‌ అవార్డ్‌ ప్రకటిస్తుంటుంది. 2023 సంవత్సరానికి గాను జీఎస్‌ఎంఏ గవర్నమెంట్‌ లీడర్‌షిప్‌ అవార్డ్‌ను భారత్‌ గెలుచుకుంది. ఫిబ్రవరి 27న బార్సెలోనాలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో భారత్‌ను విజేతగా జీఎస్‌ఎంఏ ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి వైష్ణవ్‌ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ సర్కారు చేపట్టిన సంస్కరణలకు అంతర్జాతీయ గుర్తింపుగా పేర్కొన్నారు.

సంస్కరణల ఫలితాలను మనం చూస్తున్నట్టు చెప్పారు. భారత టెలికం ఉదయిస్తున్న రంగమని, ప్రపంచం ఈ వృద్ధిని గమనించినట్టు తెలిపారు. ‘‘రైట్‌ ఆఫ్‌ వే అనుమతికి గతంలో 230 రోజులు పట్టేది. ఇప్పుడు కేవలం ఎనిమిది రోజుల్లోనే వచ్చేస్తోంది. 85 శాతానికి పైగా టవర్‌ అనుమతులు తక్షణమే లభిస్తున్నాయి’’అని మంత్రి వివరించారు. 387 జిల్లాల్లో లక్ష సైట్లతో, 5జీ విస్తరణ వేగవంతంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు. తయారీ, ఆవిష్కరణలు, ఉద్యోగ కల్పనపై భారత్‌ ప్రగతిని వివరించారు. 200 పట్టణాలకు మార్చి నాటికి 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ.. లక్ష్యానికంటే ముందే దాన్ని చేరుకున్నట్టు ప్రకటించారు.   

మరిన్ని వార్తలు