30 గంటలకు ఒక కొత్త బిలియనీర్‌

24 May, 2022 05:12 IST|Sakshi

ప్రతి 33 గంటలకు పేదరికంలోకి పది లక్షల మంది

ఆఫ్రికాలో నిమిషానికో ఆకలి మరణం

కరోనా మహమ్మారి తర్వాత పెరిగిన అసమానతలు

దావోస్‌ వేదికగా ఆక్స్‌ఫామ్‌ నివేదిక విడుదల

దావోస్‌: కరోనా వైరస్‌ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అసమానతలు పెరిగిపోయినట్టు ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ తెలిపింది. కరోనా కాలంలో ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్‌ (బిలియన్‌ డాలర్లు అంతకుమించి సంపద కలిగినవారు) కొత్తగా పుట్టుకువచ్చినట్టు చెప్పింది.

ఈ ఏడాది ప్రతి 33 గంటలకు సుమారు పది లక్షల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఈ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం సందర్భంగా దావోస్‌లో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికకు ‘ప్రాఫిటింగ్‌ ఫ్రమ్‌ పెయిన్‌’ (బాధ నుంచి లాభం/కరోనా కాలంలో పేదల కష్టాల నుంచి లాభాలు పొందడం) అని పేరు పెట్టింది.  

పెరిగిన ధరలతో బిలియనీర్లకు పంట
దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయినట్టు తెలిపింది. దీంతో ఆహారం, ఇంధన రంగాల్లోని బిలియనీర్లు తమ సంపదను ప్రతి రెండు రోజులకు బిలియన్‌ డాలర్లు (రూ.7,700 కోట్లు) చొప్పున పెంచుకున్నట్టు వివరించింది.

573 మంది కొత్త బిలియనీర్లు
కరోనా విపత్తు సమయంలో (రెండేళ్ల కాలంలో) కొత్తగా 573 మంది బిలీయనీర్లు పుట్టుకొచ్చినట్టు ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడించింది. దీన్ని ప్రతి 30 గంటలకు ఒక బిలీయనీర్‌ ఏర్పడినట్టు తెలిపింది.  

26 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి
ఈ ఏడాది 26.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని అంచనా వేస్తున్నట్టు ఆక్స్‌ఫామ్‌ ప్రకటించింది. ప్రతి 33 గంటలకు పది లక్షల మంది పేదరికంలోకి వెళ్తారని వివరించింది.  

23 ఏళ్ల కంటే రెండేళ్లలో ఎక్కువ
కరోనాకు ముందు 23 ఏళ్లలో ఏర్పడిన సంపద కంటే కరోనా వచ్చిన రెండేళ్లలో బిలియనీర్ల సంపద ఎక్కువ పెరిగినట్టు ఆక్స్‌ఫామ్‌ నివేదిక తెలిపింది. ‘‘ఇప్పుడు ప్రపంచంలోని బిలియనీర్ల సంపద విలువ ప్రపంచ జీడీపీలో 13.9 శాతానికి సమానం. 2000లో ప్రపంచ జీడీపీలో బిలియనీర్ల సంపద 4.4 శాతమే’’అంటూ ప్రపంచంలోని అసమానతలను ఆక్స్‌ఫామ్‌ తన నివేదికలో ఎత్తి చూపింది. ‘‘కార్మికులు తక్కువ వేతనానికే, దారుణమైన పరిస్థితుల మధ్య ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అధిక సంపద పరులు వ్యవస్థను దశాబ్దాలుగా రిగ్గింగ్‌ చేశారు. వారు ఇప్పుడు ఆ ఫలాలను పొందుతున్నారు. ప్రైవేటీకరణ, గుత్తాధిపత్యం తదితర విధానాల మద్దతుతో ప్రపంచ సంపదలో షాక్‌కు గురిచేసే మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు’’అని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ఈడీ గ్యాబ్రియెల్‌ బుచెర్‌ అన్నారు.  

ఆకలి కేకలు..
‘‘మరోవైపు లక్షలాది మంది పస్తులు ఉండాల్సిన పరిస్థితి. మనుగడ కోసం వారు తదుపరి ఏం చేస్తారన్నది చూడాలి. తూర్పు ఆఫ్రికా వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక వ్యక్తి ఆకలితో చనిపోతున్నారు. ఈ స్థాయి అసమానతలు మానవత్వంతో మనుషులు కలిసి ఉండడాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. ఈ ప్రమాదకరమైన అసమానతలను అంతం చేయాలి’’అని బుచెర్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఐదు అతిపెద్ద ఇంధన సంస్థలైన బీపీ, షెల్, టోటల్‌ ఎనర్జీ, ఎక్సాన్, చెవ్రాన్‌ కలసి ప్రతి సెకనుకు 2,600 డాలర్ల లాభాన్ని పొందాయని ఆక్స్‌ఫామ్‌ నివేదిక తెలిపింది. రికార్డు స్థాయి ఆహార ధరలతో శ్రీలంక నుంచి సూడాన్‌ వరకు సామాజికంగా అశాంతిని చూస్తున్నాయని.. 60% తక్కువ ఆదాయం కలిగిన దేశాలు రుణ సంక్షోభంలో ఉన్నాయని తెలిపింది.

సంపన్నుల ఐశ్వర్యం
‘‘2,668 బిలియనీర్ల వద్ద 12.7 లక్షల కోట్ల డాలర్ల సంపద ఉంది. ప్రపంచంలో అట్టడుగున ఉన్న 301 కోట్ల ప్రజల (40 శాతం) ఉమ్మడి సంపద కంటే టాప్‌ 10 ప్రపంచ బిలియనీర్ల వద్దే ఎక్కువ ఉంది. సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తి 112 ఏళ్లు కష్టపడితే కానీ.. అగ్రస్థానంలో ఒక వ్యక్తి ఏడాది సంపాదనకు సరిపడా సమకూర్చుకోలేని పరిస్థితి నెలకొంది’’అని ఆక్స్‌ఫామ్‌ నివేదిక తెలిపింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలు ఈ నెల 22న దావోస్‌లో ప్రారంభం కాగా, 26న ముగియనున్నాయి.

మరిన్ని వార్తలు