వీడియో గేమ్‌లో అన్నదమ్ములు.. పేరెంట్స్‌ ఖాతా నుంచి లక్ష ఖర్చు

5 Aug, 2021 13:44 IST|Sakshi

ఆన్‌లైన్‌ క్లాసుల వంకతో స్మార్ట్‌ ఫోన్లు పిల్లల చేతికే వెళ్లిపోతున్నాయి. అయితే తరగతులు అయిన తర్వాత కూడా చాలా సమయం ఫోన్లలలోనే గడిపేస్తు‍న్నారు చాలామంది. ఆ టైంలో తల్లిదండ్రుల నిఘా ఉండకపోతే.. అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అలా పిల్లలపై నజర్‌ పెట్టక.. వీడియో గేమ్‌ వల్ల లక్ష రూపాయల దాకా పొగొట్టుకుంది ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ జంట.

లక్నో: ఆ భార్యాభర్తలది ఉత్తర ప్రదేశ్‌ గోండా జిల్లాలోని ఓ గ్రామం. 12, 14 ఏళ్ల వయసున్న పిల్లలున్నారు ఆ జంటకి. ఆన్‌లైన్‌ క్లాసులు నడుస్తుండడంతో పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చారు. భర్త బయట పనులకు వెళ్లగా.. భార్య ఇంటి పనుల్లో మునిగిపోయింది. అయితే క్లాసులు ముగిశాక కూడా. ఫోన్‌ వాళ్ల చేతుల్లోనే ఉండనిచ్చారు. ఇంకేం సరదాగా ఆన్‌లైన్‌ గేమ్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని.. అందులో మునిగిపోయారు ఆ అన్నదమ్ములు.  ఫ్రీ ఫైర్‌ గేమ్‌ ఆడుతూ.. ఓసారి ఏడువేలు, మరోసారి 90 వేల రూపాయలు ఖర్చు పెట్టారు. అంతా ఖర్చుపెట్టి ఆటలో డైమండ్స్‌, క్యారెక్టర్ల కోసం బట్టలు కొన్నారు వాళ్లు. 

విషయం తెలియని ఆ పిల్లల తండ్రి.. వాళ్ల ఫీజుల కోసం డబ్బు డ్రా చేయడానికి  బ్యాంక్‌కి వెళ్లాడు. అకౌంట్‌లో డబ్బులు లేవని బ్యాంక్‌ సిబ్బంది చెప్పడంతో కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఆపై అసలు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. అయితే గేమ్‌కు సంబంధించి లీగల్‌ ట్రాన్‌జాక్షన్‌ కావడంతో ఏం చేయలేమని పోలీసులు చెప్పారు. ఈ విషయం తెలిసిన గోండా ఎస్పీ సంతోష్‌ మిశ్రా.. ఆ పేరెంట్స్‌కి కొంత ఆర్థిక సాయం చేస్తానని మాటిచ్చాడు. అంతేకాదు ఆయన స్థానికంగా  ఉండే కొందరు పేరెంట్స్‌ను పిలిపించుకుని స్మార్ట్‌ ఫోన్లలో పిల్లల యాక్టివిటీపై నజర్‌ పెట్టాలని స్వయంగా కౌన్సెలింగ్‌ ఇస్తున్నాడు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు