Anand Mahindra: ప్యారిస్‌ వీధుల్లో ‘మహీంద్రా’ గర్జన

2 Dec, 2021 14:11 IST|Sakshi

ఒకప్పుడు విదేశీయులు వ్యాపారం కోసం భారత్‌కి వచ్చి ఇక్కడ పాలనపగ్గాలు చేపట్టారు. కానీ స్వాతంత్ర పొందిన తర్వాత భారతీయ కంపెనీలు విదేశాలకు విస్తరించి అక్కడ జయకేతనం ఎగురవేస్తున్నాయి. ఇప్పటికే టాటా గ్రూపు ఆటోమొబైల్‌లో లాండ్‌రోవర్‌, జాగ్వర్‌ వంటి ఇంటర్నేషనల్‌ బ్రాండ్లను దక్కించుకుని భారత్‌ కీర్తిని నలు దిశలా చాటగా.. ఇప్పుడు మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపు మరో అడుగు ముందుకు వేసింది.


మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపుకి సీఈవోగా ఆనంద్‌ మహీంద్రా వచ్చిన తర్వాత కంపెనీ రూపు రేఖలను మార్చారు. వ్యాపారాన్ని దూకుడుగా విస్తరించారు. దీని కోసం మహీంద్ర రైజ్‌ అనే కంపెనీని నెలకొల్పారు. ఈ మహీంద్రా రైజ్‌ సంస్థ రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్యుగోట్ ఆటోమొబైల్‌లో పెట్టుబడులు పెట్టింది. 2014లో ఈ కంపెనీలో 51 శాతం వాటా కొనుగోలు చేసి మేజర్‌షేర్‌ హోల్డర్‌గా అవతరించింది. కాగా 2019లో ఒక్క బ్రాండ్‌ పేరు తప్ప 99 శాతం షేర్లను మహీంద్రానే దక్కించుకుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మహీంద్రా గ్రూపు పరిధిలోనే నడుస్తోంది. 

ప్యుగోట్‌ సంస్థ తయారు చేస్తున్న వాహనాలు 200 ఏళ్లుగా యూరప్‌ అంతటా విస్తరించాయి. 60 దేశాల్లో ఈ ప్యుగోట్‌ వాహనాలకు మార్కెట్‌ ఉంది. తాజాగా ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌లో నగరంలో ప్యుగోట్‌ కంపెనికి చెందిన లయన్‌ వెహికల్స్‌ని ఉపయోగిస్తున్నారు. బైకులాగే కనిపించే ఈ మూడు చక్రాల వాహనాన్ని ప్యారిస్‌ నగర పోలీసులకు కేటాయించారు. ఈ  విషయాన్ని ఓ నెటిజన్‌ ట్వీట్టర్‌లో పేర్కొనగా ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ప్యారిస్‌ నగర పోలీసులు మహీంద్రా రైజ్‌తో గర్జిస్తున్నారంటూ ఆయన కామెంట్‌ చేశారు.

చదవండి: మహీంద్రా గ్రూప్‌ రికార్డ్‌! ఈ విషయంలో ఇండియాలో తొలి ఆటోమొబైల్‌ కంపెనీగా గుర్తింపు

మరిన్ని వార్తలు