దేశంలో దివాలా కేసులు ఎన్నో తెలుసా!

9 Aug, 2022 20:34 IST|Sakshi

జూన్‌ 2022 నాటికి ఇన్సాల్వెన్సీ చట్టం కింద దాదాపు 1,999 దివాలా కేసులు నమోదయినట్లు లోక్‌సభలో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ వెల్లడించారు. ఇందులో 436 రియల్టీకి సంబంధించినవని వెల్లడించారు.  కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్‌ ప్రాసెస్‌ (సీఐఆర్‌పీ) కోసం పట్టే సమయం వ్యాపార స్వభావం, వ్యాపార సైకిల్స్‌ (ఒడిదుడుకులు), మార్కెట్‌ సెంటిమెంట్,  మార్కెటింగ్‌ వ్యవహారాలు సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కోవిడ్‌–19 మహమ్మారి కాలంలో మందగమనం సహజమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సెంట్రలైజ్డ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్, ప్రధాన మంత్రి కార్యాలయం, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇతర అధికారుల నుండి  దివాలా బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) ఫిర్యాదులను స్వీకరిస్తుందని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపిన మంత్రి, 2022 జూలై 31వ తేదీ వరకూ ఈ తరహా 6,231 ఫిర్యాదులను స్వీకరించినట్లు వెల్లడించారు. వీటిపై విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఒక ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ఆర్‌పీ(రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌)పై డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఒక ఫిర్యాదు అందినట్లు తెలిపారు. దీనిపై తగిన చర్యలను తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. సీబీఐ కూడా దివాలా పక్రియ దుర్వినియోగానికి సంబంధించి ఒక ఫిర్యాదును అందుకున్నా, తప్పు జరిగినట్లు తేలలేదని తెలిపారు.  

చదవండి: అధ్యక్షా.. బాస్‌ అంటే ఇట్టా ఉండాలా.. అదిరిపోయే జీతం, బోలెడు బెనిఫిట్స్‌ కూడా..

మరిన్ని వార్తలు