క్రిప్టోపై కేంద్రం కీలక అడుగులు.. నిషేధానికి నో

16 Nov, 2021 10:20 IST|Sakshi

క్రిప్టోపై పార్లమెంటరీ ప్యానెల్‌ సమావేశం

నియంత్రణ ఉండాలన్న సభ్యులు

క్రిప్టో పర్మిషన్‌ వద్దన్న ప్రతిపక్షం 

క్రిప్టోలతో లాభ, నష్టాలపై విస్త్రృత చర్చలు 

Parliamentary Panel Meeting on Cryptocurrency: క్రిప్టోలకు సంబంధించి నియంత్రణలు ఉండాలంటూ బీజేపీ నేత జయంత్‌సిన్హా అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ (ఫైనాన్స్‌) సోమవారం నిర్వహించిన సమావేశంలో అభిప్రాయాలు వినిపించాయి. క్రిప్టో ఫైనాన్స్‌తో (ఆర్థిక లావాదేవీలు) లాభ, నష్టాలపై ప్యానెల్‌ చర్చించింది. కొందరు సభ్యులు క్రిప్టో కరెన్సీల ఎక్సేంజీలు, లావాదేవీలపై నియంత్రణ ఉండాలే కానీ, పూర్తిగా నిషేధించడం సరికాదన్న అభిప్రాయాన్ని వినిపించారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు తెలిపాయి. 

పొంజి కాకుడదు
క్రిప్టో ఆస్తుల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుండడం, దేశీయంగాను కోట్లాది మంది వీటిల్లో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్న క్రమంలో వచ్చే రిస్క్‌లపై ఆందోళనలు వ్యక్తమవుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంటరీ ప్యానెల్‌ నిర్వహించిన ఈ సమావేశంలో క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్‌ల చీఫ్‌లు, బ్లాక్‌చైన్‌ అండ్‌ క్రిప్టో అసెట్స్‌ కౌన్సిల్‌ సభ్యులు, సీఐఐ తదితర పరిశ్రమల మండళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. క్రిప్టో ఫైనాన్స్‌పై తమ అభిప్రాయాలను వీరు ప్యానెల్‌కు తెలియజేశారు. ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న క్రిప్టోలు పొంజి స్కీమ్‌లుగా మారిపోకూడదన్న ఆందోళనను కమిటీ సభ్యులు వ్యక్తం చేశారు.

అనుమతి వద్దు
‘‘కరెన్సీ అనేది దేశ సారభౌమాధికార సాధనం. కానీ, క్రిప్టో కరెన్సీ అలా కాదు. అది కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌. ఇంటర్నెట్‌ వేదికగానే దీని నిర్వహణ ఉంటుంది. కొనుగోలు, యూజర్లే వీటి విలువను నిర్ణయిస్తుంటారు. ఇది చట్టవిరుద్ధం’’ అని కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు చెప్పారు. మొత్తానికి క్రిప్టో లావాదేవీల వ్యవహారాలు అలా వదిలివేయడం కాకుండా, నియంత్రణ అయితే ఉండాలన్న విస్తృతాభిప్రాయానికి సమావేశం వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. క్రిప్టోలపై ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నిర్వహించిన తొలి సమావేశం ఇది. సమావేశానికి వచ్చిన వారి అభిప్రాయాలను విన్నామని, ఇది ఇ‍క ముందు కూడా కొనసాగుతుందని సిన్హా తెలిపారు.

చదవండి:క్రిప్టో.. తగ్గేదేలే!

మరిన్ని వార్తలు