అక్టోబర్‌లో తగ్గిన ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు

10 Nov, 2020 05:42 IST|Sakshi

రిజిస్ట్రేషన్ల మందగమనమే కారణం

ఎఫ్‌ఏడీఏ డాటా వెల్లడి

ముంబై: సప్లై సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్లు మందగించడంతో అక్టోబర్‌లో ప్యాసింజర్‌ వాహన రిటైల్‌ అమ్మకాలు 9 శాతం క్షీణించినట్లు ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య ఎఫ్‌ఏడీఏ తెలిపింది. మొత్తం 1,464 రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసుల్లో(ఆర్‌టీఓ)1,257 ఆఫీసుల నుంచి సేకరించిన వెహకిల్‌ రిజిస్ట్రేషన్‌ గణాంకాల ప్రకారం ఎఫ్‌ఏడీఏ రిటైల్‌ వాహన అమ్మకాల డేటాను విడుదల చేసింది. సమీకరించిన గణాంకాల ప్రకారం ఈ అక్టోబర్‌లో మొత్తం 2,49,860 పాసింజర్ల వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 2,73,980 యూనిట్లతో పోలిస్తే ఇవి 9 శాతం తక్కువ. ఇదే అక్టోబర్‌లో టూ–వీలర్స్‌ అమ్మకాలు 27 శాతం క్షీణించి 10,41,682 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఈ విక్రయాలు 14,23,394 యూనిట్లుగా ఉన్నాయి.

వాణిజ్య వాహన విక్రయాలు 30 శాతం పతనమై 44,480 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహన అమ్మకాలు 64.5 శాతం, ట్రాక్టర్స్‌ అమ్మకాలు 55శాతం క్షీణించాయి. మొత్తం అన్ని విభాగపు అమ్మకాలు 24శాతం క్షీణించి 14,13,549 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే అక్టోబర్‌లో మొత్తం అమ్మకాలు 18,59,709గా ఉన్నాయి.  పండుగ సందర్భంగా వాహన రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నప్పటికీ.,  వార్షిక ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు తక్కువగానే నమోదయ్యాయని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ వింకేష్‌ గులాటి తెలిపారు. ‘‘కరోనా ప్రభావంతో డీలర్లు డిమాండ్‌కు తగ్గట్లు కొత్త వేరియంట్ల కొనుగోళ్లకు, అధిక నిల్వలను పెంచుకునేందుకు ఆసక్తి చూపలేకపోయారు. అలాగే గత సీజన్‌తో పోలిస్తే ఈసారి తక్కువ డిస్కౌంట్ల ప్రకటన అమ్మకాలపై ప్రభావాన్ని చూపింది’’ అని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ వింకేష్‌ గులాటి తెలిపారు.  

మరిన్ని వార్తలు