అటు అమ్మకాల్లో దుమ్ము లేపుతుంటే..ఇటు ఈసురో మంటున్నాయి

7 Jan, 2022 21:16 IST|Sakshi

అసలే ఇప్పుడు కరోనా కాలం..ఏ రంగం చూసినా ఈసురో మంటోంది. కానీ ఆటోమొబైల్‌ రంగం మాత్రం జోరును కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. 2020లో ఈవీ వెహికిల్స్‌ (టూ వీలర్స్‌) అమ్మకాలు 1,00,736 యూనిట్లు ఉండగా.. 2021లో ఎలక్ట్రిక్‌ టూ వీలర్ల (ఈ2డబ్ల్యూ) విక్రయాలు దేశీయంగా 2,33,971 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో దేశీయ ప్యాసింజర్‌ వాహన రిటైల్‌ విక్రయాలు గతేడాది డిసెంబర్‌లో నెమ్మదించాయి. ఆటో పరిశ్రమపై సెమికండెక్టర్ల కొరత ప్రభావం కొనసాగడం ఇందుకు కారణమని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. 

గతేడాది(2021) డిసెంబర్‌లో 2,44,639 యూనిట్ల ప్యాసింజర్‌ వాహనాలు అమ్ముడుపోయినట్లు ఫాడా తెలిపింది. అంతకుముందు (2020) ఇదే డిసెంబర్‌లో అమ్ముడైన 2,74,605 యూనిట్లతో పోలిస్తే ఇవి 11 శాతమని తక్కువ. మొత్తంగా వాహనాల రిటైల్‌ విక్రయాలు గత నెల 16.05 శాతం తగ్గి 15,58,756 యూనిట్లుగా నమోదయ్యాయి.దేశంలో 1,590 వాహన రిజిస్ట్రేషన్‌ కేంద్రాలుండగా, 1,379 కేంద్రాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలను ఫాడా విడుదల చేసింది.

‘‘ఆటో కంపెనీలు ఏడాది నిల్వలను తగ్గించుకునేందుకు డిసెంబర్‌లో వాహనాలపై భారీ రాయితీలను ప్రకటిస్తుంటాయి. కావున ప్రతి ఏటా డిసెంబర్‌లో విక్రయాలు భారీగా ఉంటాయి. అయితే ఈసారి అమ్మకాలు నిరాశపరిచాయి’’ అని ఫాడా చైర్మన్‌ వింకేశ్‌ గులాటి తెలిపారు. సెమికండెక్టర్ల కొరత కొనసాగడంతోఆటో కంపెనీలు డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తిని సాధించడంలో విఫలయ్యాయని పేర్కొన్నారు. అయితే, గతంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడిందని పేర్కొన్నారు. దీంతో డీలర్లకు సరఫరా పెరిగిందన్నారు.  

ద్విచక్ర వాహన విక్రయాలు అంతంతే... 
సమీక్షించిన నెలలో ద్వి చక్ర వాహన విక్రయాలు 20 మేర క్షీణించాయి. డిసెంబరు 2020లో 14,33,334 యూనిట్లు విక్రయించగా.. ఈసారి అవి 11,48,732 యూనిట్లకు పరిమితమయ్యాయి. వాహనాల ధరలు పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ తగ్గడం, వర్క్‌ ఫ్రమ్‌ హోం పొడిగింపు, తాజాగా ఒమిక్రాన్‌ భయాలు వంటి కారణాలు విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. 

వాణిజ్య వాహన అమ్మకాలు జూమ్‌ 
వాణిజ్య వాహన అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. గతేడాది(2021) డిసెంబర్‌లో 58,847 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది డిసెంబర్‌లో అమ్ముడైన 51,749 యూనిట్లతో పోలిస్తే ఇవి 14శాతం అధికం. కేంద్రం మౌలిక వసతి కల్పనలో భాగంగా రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, సరుకు రవాణా ఛార్జీలు పెరగడం, కొత్త ఏడాదిలో కంపెనీలు వాహన ధరల్ని పెంచడం, లో బేస్‌ తదితర కారణాలతో ఈ విభాగంలో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. 

>
మరిన్ని వార్తలు