వాహన తయారీకి తాత్కాలిక బ్రేక్‌

14 May, 2021 04:17 IST|Sakshi

వైరస్‌ వ్యాప్తితో కంపెనీల నిర్ణయం

తగ్గిన  ఆటో విడిభాగాల సరఫరా

షోరూంలలో పేరుకున్న నిల్వలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన పరిశ్రమకూ కోవిడ్‌–19 దెబ్బ పడింది. తయారీ ప్లాంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు వైరస్‌ బారిన పడడం, లాక్‌డౌన్లతో షోరూంలు మూతపడడం ఈ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. మరోవైపు ఆక్సిజన్‌ కొరతతో స్టీల్‌ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. ఇది కాస్తా  స్టీల్‌ను ముడి పదార్థంగా వాడే ఆటో విడిభాగాల తయారీ కంపెనీలకు సమస్యగా పరిణమించింది.

ఏప్రిల్‌లో స్టీల్‌ వినియోగం 26 శాతం తగ్గిందంటే పరిస్థితికి అద్దంపడుతోంది. ఇంకేముంది వాహన తయారీ సంస్థలు తాత్కాలికంగా తయారీ ప్లాంట్లను మూసివేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు తయారీని తగ్గించివేస్తున్నాయి. మహారాష్ట్రలో గత నెల తొలి వారంలో లాక్‌డౌన్‌ ప్రకటించగానే వాహన పరిశ్రమపై ఒత్తిడి పెరిగింది. క్రమంగా ఇతర రాష్ట్రాలూ లాక్‌డౌన్లు విధించడంతో ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి కష్టాలు చుట్టుముట్టాయి. ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్టు తయారీ సంస్థలు తెలిపాయి. అయితే షట్‌డౌన్‌ కాలంలో వార్షిక నిర్వహణ చేపట్టనున్నట్టు కంపెనీలు వెల్లడించాయి.

ఒకదాని వెంట ఒకటి..
వాహన తయారీ సంస్థలు ఒకదాని వెంట ఒకటి తాత్కాలికంగా ఉత్పత్తికి విరామం ప్రకటిస్తున్నాయి. మే 1 నుంచి 9 రోజులపాటు హరియాణాలో రెండు, గుజరాత్‌లో ఒక ప్లాంటును మూసివేస్తున్నట్టు భారత్‌లో ప్యాసింజర్‌ వెహికల్స్‌ రంగంలో అగ్రశ్రేణి సంస్థ మారుతి సుజుకీ గత నెల ప్రకటించింది. అయితే వైరస్‌ ఉధృతి నేపథ్యంలో మే 16 వరకు షట్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. వార్షిక నిర్వహణలో భాగంగా జూన్‌లో నాలుగు రోజులపాటు చేపట్టాల్సిన తాత్కాలిక షట్‌డౌన్‌ను మే నెలకు మార్చినట్టు మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. తెలంగాణలోని జహీరాబాద్‌తోపాటు చకన్, నాసిక్, కండివాలీ, హరిద్వార్‌లో సంస్థకు తయారీ కేంద్రాలున్నాయి.

ఎంజీ మోటార్స్‌ ఏప్రిల్‌ 29 నుంచి వారంపాటు గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంటును తాత్కాలికంగా మూసివేసింది. మే 10 నుంచి ఆరు రోజులపాటు చెన్నై ప్లాంటులో తయారీని నిలిపివేస్తున్నట్టు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తెలిపింది. ఏటా ఈ కేంద్రంలో 7.5 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం కంపెనీకి ఉంది. ఈ ఫ్యాక్టరీ నుంచి 88 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. హోండా కార్స్‌ ఇండియా రాజస్తాన్‌ తయారీ కేంద్రాన్ని మే 7 నుంచి 18 వరకు తాత్కాలికంగా మూసివేసింది. ఏడాదికి ఈ ఫ్యాక్టరీలో 1.8 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. కర్ణాటకలోని రెండు ప్లాంట్లలో ఏప్రిల్‌ 26 నుంచి మే 14 వరకు మెయింటెనెన్స్‌ షట్‌డౌన్‌ చేపట్టనున్నట్టు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ వెల్లడించింది. ఉత్పత్తిని తగ్గించడంతోపాటు మే నెల కార్యకలాపాలను 7–15 రోజులకే పరిమితం చేయనున్నట్టు అశోక్‌ లేలాండ్‌ తెలిపింది.

టూ వీలర్స్‌ రంగంలోనూ..
సెకండ్‌ వేవ్‌ ముంచుకొచ్చిన కారణంగా టూ వీలర్‌ షోరూంల వద్ద  నిల్వలు పేరుకుపోయినట్టు సమాచారం. కంపెనీని బట్టి 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ద్విచక్ర వాహన తయారీ రంగంలో భారత్‌లో అగ్రశేణి సంస్థ హీరో మోటోకార్ప్‌ మే 16 వరకు తాత్కాలికంగా తయారీని నిలిపివేసింది. గత నెల చివరి నుంచి కంపెనీ తన ప్లాంట్లలో షట్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తోంది. వీటిలో చిత్తూరు ప్లాంటుతోపాటు హరియాణా, ఉత్తరాఖండ్, రాజస్తాన్, గుజరాత్‌లోని ఆరు కేంద్రాలు ఉన్నాయి.

నీమ్రానాలోని గ్లోబల్‌ పార్ట్స్‌ సెంటర్‌తోపాటు ఆర్‌అండ్‌డీ ఫెసిలిటీ తలుపులు మూసుకున్నాయి. కంపెనీకి 90 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది. రెండవ అతిపెద్ద సంస్థ హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ సైతం ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపేసింది. హరియాణా, రాజస్తాన్, కర్ణాటక, గుజరాత్‌ ప్లాంట్లలో మే 1 నుంచి మొదలైన షట్‌డౌన్‌ 15 వరకు కొనసాగనుంది. మే 15 నుంచి రెండు వారాలు తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌ ప్లాంట్లలో తయారీకి తాత్కాలిక బ్రేక్‌ ఇవ్వనున్నట్టు యమహా ప్రకటించింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మే 13–16 మధ్య చెన్నైలోని రెండు ప్లాంట్లలో కార్యకలాపాలు ఆపివేస్తున్నట్టు వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు