జోరుగా ప్యాసింజర్‌ వాహన విక్రయాలు, టాప్‌లో ఆ రెండు

1 Dec, 2022 08:46 IST|Sakshi

 నవంబర్‌ లో 30 శాతం  అధికంగా ఉండొచ్చు 

ఎంకే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌  సర్వీసెస్‌ నివేదిక  

ముంబై: ప్యాసింజర్‌ వాహనాలు ఈ నెలలో జోరుగా విక్రయాలను నమోదు చేస్తాయని బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంచనా వేసింది. క్రితం ఏడాది నవంబర్‌తో పోలిస్తే 30 శాతం అధిక నమ్మకాలు నమోదవుతాయని పేర్కొంది. ఆర్డర్‌ బుక్‌ బలంగా ఉండడం, పెరిగిన తయారీని ప్రస్తావించింది. వాణిజ్య వాహనాలు రెండంకెల వృద్ధిని చూపిస్తాయని పేర్కొంది. డీలర్ల స్థాయిలో నిల్వలు ఉన్నందున ట్రాక్టర్ల విక్రయాలు వృద్ధిని చూపించకపోవచ్చని అంచనా వేసింది. అక్టోబర్‌తో పోలిస్తే (పండుగల సీజన్‌) నంబర్‌లో వాహనాలపై డిస్కౌంట్‌ ఆఫర్లు తగ్గినట్టు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఎంకే గ్లోబల్‌ వివరించింది. ఈ నెల గణాంకాలను వాహన తయారీ సంస్థలు డిసెంబర్‌ 1న ప్రకటించనుండడం గమనార్హం.  

ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌ టాప్‌ 
ప్యాసింజర్‌ వాహనాల ఆర్డర్లు బలంగా ఉన్నాయని, వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహన అమ్మకాల పరంగా సానుకూల గణాంకాలు నమోదవుతాయని ఎంకే గ్లోబల్‌ తెలిపింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా దేశీ విక్రయాల పరంగా 64 శాతం వరకు వృద్ధిని చూపించొచ్చని, టాటా మోటార్స్‌ దేశీ అమ్మకాలు 51 శాతం పెరగొచ్చని పేర్కొంది. మారుతి సుజుకీ 18 శాతం అధిక అమ్మకాలు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్యాసింజర్, కార్గో విభాగాల నుంచి డిమాండ్‌ బలంగా ఉండడంతో వాణిజ్య వాహన అమ్మకాలు 15 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేసింది. అశోక్‌ లేలాండ్‌ సంస్థ వాణిజ్య వాహన అమ్మకాలు 41 శాతం పెరగొచ్చని.. ఐచర్‌ మోటార్‌-వోల్వో ఐచర్‌ వాణిజ్య వాహన అమ్మకాల్లో 36 శాతం మేర వృద్ధి ఉంటుందని పేర్కొంది. ద్విచక్ర వాహన అమ్మకాలు 10 శాతం మేర పెరుగుతాయని తెలిపింది.      
 

మరిన్ని వార్తలు