పవన్‌ హన్స్‌ అమ్మకానికి బ్రేక్‌

17 May, 2022 06:28 IST|Sakshi

ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల ఎఫెక్ట్‌

న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ పవన్‌ హన్స్‌ అమ్మకపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపి వేసింది. కంపెనీ కొనుగోలుకి ఎంపికైన కన్సార్షియంలోని అల్మాస్‌ గ్లోబల్‌కు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీ జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో విక్రయాన్ని పక్కన పెట్టింది. తదుపరి చర్యలు తీసుకునేముందు ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలపై చట్టపరమైన పరిశీలన చేపట్టినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీంతో బిడ్‌ను గెలుచుకున్నప్పటికీ లెటర్‌ ఆఫ్‌ అవార్డు(ఎల్‌వోఏ) జారీని చేపట్టబోమని తెలియజేశారు.

పవన్‌ హన్స్‌ కొనుగోలుకి బిగ్‌ చార్టర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్, మహరాజా ఏవియేషన్‌ ప్రయివేట్, అల్మాస్‌ గ్లోబల్‌ అపార్చునిటీ ఫండ్‌ ఎస్‌పీసీతో కూడిన స్టార్‌9 మొబిలిటీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కన్సార్షియం బిడ్‌ గెలుపొందినట్లు ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. పీఎస్‌యూ సంస్థ కొనుగోలుకి రూ. 211.14 కోట్ల విలువైన బిడ్‌ను స్టార్‌9 మొబిలిటీ దాఖలు చేసింది. ఇది ప్రభుత్వం నిర్ణయించిన రూ. 199.92 కోట్ల రిజర్వ్‌ ధరకంటే అధికం.

అయితే కన్సార్షియంలో అల్మాస్‌ గ్లోబల్‌ అతిపెద్ద వాటాదారు కావడం గమనార్హం! స్టార్‌9 మొబిలిటీలో అల్మాస్‌ గ్లోబల్‌ అపార్చునిటీ వాటా 49%కాగా.. బిగ్‌ చార్టర్‌ 26%, మహరాజా ఏవియేషన్‌ 25% వాటాలను కలిగి ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన కంపెనీ రిజల్యూషన్‌లో భాగంగా రుణదాతలకు చెల్లింపుల్లో విఫలమైనట్లు వెలువడిన వార్తలతో అల్మాస్‌ గ్లోబల్‌కు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెండో ప్రభుత్వ రంగ కంపెనీలో వ్మూహాత్మక వాటా విక్రయానికి బ్రేకులు పడినట్లయ్యింది. ఇంతక్రితం బిడ్‌ గెలుపొందిన సంస్థపై ఆరోపణల కారణంగా సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(సీఈఎల్‌) విక్రయం సైతం నిలిచిపోయింది.

మరిన్ని వార్తలు