వేతనాల కోతతో తీవ్ర పరిణామాలు 

23 Jul, 2020 18:57 IST|Sakshi

వేతనాల కోతపై ఎయిరిండియా సీనియర్‌ పైలట్ల లేఖ

మానసిక సమస్యలు, తీవ్ర పరిణామాలు 

సాక్షి, న్యూఢిల్లీ : జీతాల కోత నిర్ణయంపై ఎయిరిండియా పైలట్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ జీతాలను భారీగా తగ్గించాలన్న ప్రభుత్వం నిర్ణయం తమ కుటుంబ సభ్యులపై వినాశకర ప్రభావాన్ని చూపించిందటూ సీనియర్‌ పైలట్లు ఆరోపించారు. ఈ మేరకు వారు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి హర్దీప్ పూరీకి ఒక లేఖ రాశారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ‘వందే భారత్ మిషన్’ కార్యక్రమంలో ఫ్రంట్‌లైన్‌లో  సేవలందిస్తున్న 60 మంది పైలట్లు  వైరస్‌ బారిన పడ్డారంటూ  ఆవేదన వ్యక్తం చేశారు.

పైలట్ల జీతం 75శాతం వరకు వేతనాన్ని తగ్గించే ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమైందని పైలట్లు ఆగ్రహం వ​‍క్తం చేశారు. ఈ అసంబద్ధమైన, వివక్షాపూరిత నిర్ణయం తీవ్ర మానసిక ప్రభావాన్ని పడేస్తుందని, ఇది చాలాసార్లు నిరూపితమైందని ఆరోపించారు. అంతేకాదు ఇది విపరీత చర్యలకు దారితీసే అవకాశం ఉందని సీనియర్ పైలట్లు హెచ్చరించారు. మరోవైపు ఎయిరిండియా ఇటీవల లీవ్‌ వితౌట్‌ పే పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల వరకు వేతనం లేకుండా కొంతమంది ఉద్యోగులను సెలవుపై పంపించాలని నిర్ణయించింది.  (కరోనా: ఎయిరిండియా ఉద్యోగులకు చేదువార్త)

వందేభారత్‌ మిషన్‌ ద్వారా ఎయిరిండియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా 7,73,000 మంది భారతీయులను తీసుకొచ్చినట్టు హర్దీప్ స్వయంగా ప్రకటించారు. ఈ నెల(జూలై)16న ఆయన మాట్లాడుతూ ఎయిరిండియా  మనుగడ కొనసాగాలంటే లీవ్‌ వితౌట్‌ పే నిర్ణయం తప్పదంటూ సమర్ధించారు. ఒకవేళ ఎయిరిండియా మొత్తానికే మూతపడితే ఎవరికీ ఉద్యోగాలుండవని పేర్కొన్నారు.  మిగులు సిబ్బంది అధికంగా ఉన్నారనీ,  దీనికి తోడు శిక్షణ పొందిన వ్యక్తులు కూడా అందుబాటులో ఉన్నారని వ్యాఖ్యానించారు.  (ఆ కథనంపై చలించిన సోనూసూద్‌)

కాగా కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలతో దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రదానంగా దేశీయ విమానయాన సంస్థలు వేతన కోతలు, సిబ్బంది కోత లాంటి ఖర్చు తగ్గించే చర్యలను చేపట్టాయి. సుమారు 70 వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ సంస్థ ఎయిరిండియాను విక్రయించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. 

మరిన్ని వార్తలు