పేటీఎంకు షాక్‌.. ఈ-కామర్స్‌ వింగ్‌కి ఆ హోదా దూరం

24 Dec, 2021 10:07 IST|Sakshi

Patym Mall Lost Unicorn Status: డిజిటల్‌ పేమెంట్‌ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్‌ తగిలింది. పేటీఎం ఈ-కామర్స్‌ విభాగం  ‘పేటీఎం మాల్‌’ యూనికార్న్‌ హోదాను కోల్పోయింది. తాజాగా హురూన్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రకటించిన యూనికార్న్‌ జాబితాలో ‘పేటీఎం మాల్‌’ స్థానం కనిపించలేదు.    


స్టార్టప్‌ వాల్యూయేషన్‌ 1 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న ప్రైవేట్‌ స్టార్టప్‌లను ‘యూనికార్న్‌’ కంపెనీలుగా ప్రకటిస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేటీఎం మాల్‌ వాల్యూ 1 బిలియన్‌ కంటే కిందకి పడిపోయినట్లు సమాచారం. ఈ పతనంపై పేటీఎం స్పందించాల్సి ఉంది. ఇక పేటీఎం మాల్‌తో పాటు మరో ఏడు భారీ స్టార్టప్‌లు యూనికార్న్‌ హోదాను పొగొట్టుకున్నాయి. వీటిలో చాలావరకు చైనాకు చెందినవే ఉండడం విశేషం. 

ఈసారి లిస్టులో 673 కొత్త సంస్థలు స్థానం దక్కించుకున్నాయి. వేల్యుయేషన్స్‌ 1 బిలియన్‌ డాలర్ల దిగువకి పడిపోవడంతో 39 కంపెనీలు యూనికార్న్‌ హోదా కోల్పోయాయి.   స్టాక్‌ ఎక్సేంజ్‌ లిస్ట్‌ కావడం లేదంటే ఇతర సంస్థలు కొనుగోలు చేయడం వంటి కారణాలతో మొత్తం 162 సంస్థలను యూనికార్న్‌ లిస్టు నుంచి తప్పించారు. 

ఈ-కామర్స్‌ రంగం పోటీలో భాగంగా పేటీఎం మాల్‌ను 2016లో పేటీఎం లాంఛ్‌ చేసింది. రెండేళ్లు తిరగకుండానే బిలియన్‌ డాలర్ల వాల్యూతో యూనికార్న్‌ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది పేటీఎం మాల్‌. ఈబే ఫండింగ్‌ తర్వాత 2019లో పేటీఎం మాల్‌ విలువ 2.86 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఆ సమయంలో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లతో సైతం పోటీపడింది పేటీఎం మాల్‌. కిందటి ఏడాది 3 బిలియన్‌ డాలర్ల వాల్యూతో నిలిచిన పేటీఎం మాల్‌.. ఈ ఏడాది ఏకంగా యూనికార్న్‌ హోదా కోల్పోవడం విశేషం. ఇంకోవైపు ఐపీవోకి వెళ్లిన పేటీఎం.. చేదు ఫలితాల్నే చవిచూస్తోంది.
 

చదవండి: బ్రిటన్‌ను వెనక్కి నెట్టిన భారత్‌.. నెక్స్ట్‌ చైనానే!

మరిన్ని వార్తలు