Paytm CEO Dance Video: 16 వేల కోట్ల రూపాయల ఐపీవో.. డ్యాన్స్‌తో అదరగొట్టిన సీఈవో

25 Oct, 2021 10:35 IST|Sakshi

చిన్న మొక్కగా మొదలైన స్టార్టప్‌ కంపెనీలు పెద్ద వట వృక్షంలా ఎదిగితే దాన్ని స్థాపించిన వ్యక్తుల ఆనందానికి హద్దే ఉండదు. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ. సెబీ తాజా నిర్ణయంతో ఆయనలో ఉప్పొంగిన సంతోషం కట్టలు తెంచుకుని చక్కని నృత్యంగా మారింది. 

సెబీ గ్రీన్‌ సిగ్నల్‌
ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం గత కొంత కాలంగా తమ సేవలను మరింతగా విస్తరించే యోచనలో ఉంది. దీంతో నిధుల సమీకరణ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. అందులో భాగంగా ఏడాది కాలంగా పబ్లిక్‌ ఇష్యూకి వచ్చేందుకు సన్నహకాలు చేస్తోంది. కాగా తాజాగా పేటీఎంకి సంబంధించి ఇన్షియల్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో)కి సెక్యూరిటీ ఎక్సేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) అనుమతి ఇచ్చింది.

రూ, 16,600 కోట్లు
పేటీఎం సంస్థ ఐపీవో ద్వారా రికార్డు స్థాయిలో రూ. 16,600 కోట్ల రూపాయలను మార్కెట్‌ నుంచి సమీకరించనుంది. దీంతో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ ఆనందంతో డ్యాన్స్‌ చేశారు. సెబీ నుంచి అనుమతులు వచ్చాయనే విషయం తెలియగానే సంస్థకు చెందిన ఉద్యోగులతో కలిసి ఆఫీసులో చిందులేశారు. 

అమితాబ్‌ పాటకి
బిగ్‌బి అమితాబ్‌ నటించిన లావారిస్‌ సినిమాలో అప్‌నీతో జైసే తైసే పాటకి లయబద్దంగా నృత్యం చేస్తూ విజయ్‌ శేఖర్‌ శర్మ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వీడియోను మరో పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం విజయ్‌ శేఖర్‌కి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

జోమాటో తర్వాత
స్టాక్‌ మార్కెట్‌లో స్టార్టప్‌లు సంచలనం సృష్టిస్తున్నాయి. జోమాటో సృష్టించిన ప్రకంపనలు ఇంకా ఆగకముందే మరోసారి మార్కెట్‌లో అలజడి రేపేందుకు పేటీఎం రెడీ అయ్యింది.

మరిన్ని వార్తలు