‘పేటీఎం మనీ’పై ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌

14 Jan, 2021 06:17 IST|Sakshi

రెండేళ్లలో రోజువారీ టర్నోవర్‌ రూ.1.5 లక్షల కోట్లు

సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్‌ శర్మ

న్యూఢిల్లీ: పేటీఎంకు చెందిన పేటీఎం మనీ తన ప్లాట్‌ఫామ్‌పై ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ (ఎఫ్‌అండ్‌వో) సేవలను అందించనున్నట్టు ప్రకటించింది. వచ్చే 18 నెలల నుంచి 24 నెలల కాలంలో రోజువారీ రూ.1.5 లక్షల కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు సంస్థ బుధవారం ప్రకటించింది. పేటీఎం మనీ ఇప్పటికే స్టాక్స్, డైరెక్ట్‌ మ్యూచువల్‌ ఫండ్స్, ఈటీఎఫ్, ఐపీవో, ఎన్‌పీఎస్, డిజిటల్‌ బంగారం సాధనాల్లో పెట్టుబడుల సేవలను అందిస్తోంది. 10 కోట్ల మంది భారతీయులకు వెల్త్‌ సేవలను (సంపద) అందించడమే తమ లక్ష్యమని, ఎఫ్‌అండ్‌వో సేవలను ప్రారంభించిన సందర్భంగా పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ చెప్పారు. ఎఫ్‌అండ్‌వో సేవల ఆరంభం దీన్ని మరింత వేగవంతం చేస్తుందన్నారు. ‘‘మొదటిసారి మొబైల్‌ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్పత్తిని రూపొందించాము. ఎంతో సులభంగా, తక్కువ ధరతో కూడిన ఉత్పత్తులను అందించడం ద్వారా చిన్న పట్టణాల్లోకి బలంగా చొచ్చుకుపోతాము’’ అని  విజయ్‌ శేఖర్‌ శర్మ చెప్పారు.  

ట్రేడ్‌కు రూ.10 చార్జీ
అన్ని రకాల ఎఫ్‌అండ్‌వో లావాదేవీలకు కేవలం రూ.10 చార్జీగా (ఒక ఆర్డర్‌కు) పేటీఎం వసూలు చేయనుంది. క్యాష్‌ విభాగంలోనూ ఇంట్రాడే ట్రేడ్స్‌కు రూ.10, డెలివరీ ట్రేడ్స్‌ను ఉచితంగా ఈ సంస్థ ఆఫర్‌ చేస్తోంది.  18–24 నెలల్లో రోజువారీగా మిలియన్‌ ట్రేడ్స్‌ను, రూ.1.5 లక్షల కోట్ల టర్నోవర్‌ను సాధించాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్టు పేటీఎం మనీ సీఈవో వరుణ్‌ శ్రీధర్‌ చెప్పారు. ఎఫ్‌అండ్‌వో సేవలను తొలుత 500 మంది యూజర్లకు అందిస్తామని.. వచ్చే రెండు వారాల్లో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు