లాభాలను చేరుకునే మార్గంలోనే పేటీఎం

15 Nov, 2022 04:59 IST|Sakshi

వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ వెల్లడి

న్యూఢిల్లీ: పేటీఎం పేరుతో డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవలను అందించే వన్‌97 కమ్యూనికేషన్స్‌.. లాభాలు, సానుకూల నగదు ప్రవాహాలను నమోదు చేసేందుకు సరైన మార్గంలోనే ప్రయాణం చేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు వాటాదారులకు ఒక లేఖ రాశారు. తద్వారా సంస్థ భవిష్యత్తు పనితీరుపై నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. అక్టోబర్‌ నెలలకు సంబంధించి పనితీరు గణాంకాలను తెలియజేశారు.

దేశంలో ఎంతో అధిక డిమాండ్‌ ఉన్న రుణ వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నట్టు చెప్పారు. ‘‘ఏడాది క్రితం పబ్లిక్‌ మార్కెట్‌ (ఐపీవో, లిస్టింగ్‌)కు వచ్చాం. పేటీఎం విషయంలో ఉన్న అంచనాలపై మాకు అవగాహన ఉంది. లాభదాయకత, మిగులు నగదు ప్రవాహాల నమోదు దిశగా కంపెనీ సరైన మార్గంలో వెళుతోంది. మరింత విస్తరించతగిన, లాభదాయక ఆర్థిక సేవల వ్యాపారం ఇప్పుడే మొదలైంది’’అని తన లేఖలో పేర్కొన్నారు.

సెప్టెంబర్‌ త్రైమాసికానికి పేటీఎం రూ.571 కోట్ల నష్టాలను ప్రకటించడం తెలిసిందే. వచ్చే ఏడాది ప్రయాణంపై ఎంతో ఆసక్తి ఉందంటూ, ఎబిట్డా లాభం, ఫ్రీక్యాష్‌ ఫ్లో సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ‘‘మన దేశంలో రుణాలకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉంది. తక్కువ మందికే రుణ సదుపాయం చేరువ కావడం, రుణ వ్యాపారంలో ఉన్న కాంపౌండింగ్‌ స్వభావం దృష్ట్యా, దీనిపై మేము ఎంతో ఆశాభావంతో ఉన్నాం’’అని శర్మ తెలిపారు.

మరిన్ని వార్తలు