పేటీఎం షేరు ఢమాల్‌, కారణం ఏంటో చెప్పిన విజయ్‌ శేఖర్‌ శర్మ!

7 Apr, 2022 08:09 IST|Sakshi

Paytm Share Decline Reason, న్యూఢిల్లీ: డిజిటల్‌ పేమెంట్స్‌ దిగ్గజం పేటీఎమ్‌ షేరు విలువ పతనంకావడానికి మార్కెట్ల ఆటుపోట్లే కారణమని వన్‌97 కమ్యూనికేషన్స్‌ సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ పేర్కొన్నారు. అధిక వృద్ధికి వీలున్న స్టాక్స్‌పై ఇటీవల మార్కెట్‌ హెచ్చుతగ్గులు ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు.

రానున్న ఆరు త్రైమాసికాల్లోకంపెనీ లాభనష్టాలులేని(బ్రేక్‌ఈవెన్‌) స్థితికి చేరుకోగలదని అంచనా వేశారు. నిర్వహణ లాభాలు(ఇబిటా) ఆర్జించే స్థాయికి చేరగలదని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అధిక వృద్ధికి వీలున్న స్టాక్స్‌లో మార్కెట్‌ ఒడిదుడుకులు ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు వాటాదారులకు రాసిన లేఖలో శర్మ పేర్కొన్నారు. పేటీఎమ్‌ బ్రాండుతో వన్‌97 కమ్యూనికేషన్స్‌ డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసులందిస్తున్న సంగతి తెలిసిందే.  

నేలచూపుల్లో...: గతేడాది షేరుకి రూ. 2,150 ధరలో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన వన్‌97 కమ్యూనికేషన్స్‌ కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతూ వస్తోంది. ఇటీవల బీఎస్‌ఈలో రూ. 520 వద్ద జీవితకాల కనిష్టాన్ని చవిచూసింది. తాజాగా 5 శాతం బలపడి రూ. 637 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2022) ఫలితాలు ప్రకటించవలసి ఉన్నదని, ప్రస్తుతం కంపెనీ బిజినెస్‌ అవకాశాలు ప్రోత్సాహాన్నిస్తున్నాయని లేఖలో శర్మ ప్రస్తావించారు.

 ఇది కొనసాగనున్నట్లు భావిస్తున్నామంటూనే, ఏడాదిన్నర కాలంలో నిర్వహణ ఇబిటాను సాధించగలమన్న ధీమా వ్యక్తం చేశారు. వెరసి 2023 సెప్టెంబర్‌కల్లా ఆశించిన ఫలితాలు అందుకోగలమని అభిప్రాయపడ్డారు. తద్వారా దీర్ఘకాలంలో వాటాదారులకు విలువ చేకూర్చనున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా మార్కెట్‌ విలువ ఐపీవో స్థాయికి చేరాకమాత్రమే తనకు జారీ అయిన షేర్లు తనకు సొంతమవుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు