పేటీఎం అట్టర్‌ ప్లాప్‌షో.. 63 వేల కోట్లు మటాష్‌! ఇన్వెస్టర్లు లబోదిబో

22 Nov, 2021 13:44 IST|Sakshi

Paytm Shares Downfall Continue: ఇండియన్‌ మార్కెట్‌లో పేటీఎం అట్టర్‌ప్లాప్‌ షో కొనసాగుతోంది. వరుసగా మూడు రోజుల సెలవు తర్వాత సోమవారం మొదలైన మార్కెట్‌లో పేటీఎం షేర్ల విలువ పతనాన్నే చవిచూస్తోంది. 


మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి పేటీఎం మాతృక సంస్థ వన్‌97 one97 కమ్యూనికేషన్‌ షేర్ల విలువ 14 శాతం పతనంతో రూ.1,348.30 వద్ద కొనసాగుతోంది. మొత్తంగా ఐపీఓ ఇష్యూ ప్రైస్‌తో(రూ.2,150) పోలిస్తే 36 శాతం పతనానికి గురైంది. ఇన్వెస్టర్ల 63 వేల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది.

ఈ కుదేలుతో పేటీఎం ఫౌండర్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ సంపద భారీగా పతనం అయ్యింది. సుమారు 1.5 బిలియన్‌ డాలర్లు(పదివేల కోట్ల రూపాయలకు పైగా) సంపద కరిగిపోయనట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా 2.5 బిలియన్‌ డాలర్లకు చేరిన శర్మ సంపద.. సోమవారం ఉదయం నాటికి 781 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇక పేటీఎంలో 9.1 శాతం వాటా కలిగి ఉన్న శర్మ.. ఆరుకోట్ల ఈక్విటీ షేర్లు, 2.1 కోట్ల ఆప్షన్స్‌ కలిగి ఉన్నారు.
 
 

భారత్‌లోనే అతి పెద్ద ఐపీవోగా పేటీఎం ఇటీవల ప్రజల ముందుకు వచ్చిన సంగతి మనకు తేలిసిందే. అయితే ఐపీవో ద్వారా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో లక్షా ఐదువేల కోట్లతో నిలిచిన పేటీఎం.. పతనం దిశగా వెళ్తూ సోమవారం నాటికి 87 వేల కోట్లకు చేరుకుంది.  ఇక ఐపీవోలో రికార్డు సృష్టించిన పేటీఎం షేర్లు తొలిరోజు(గురువారం 18 నవంబర్‌, 2021) లిస్టింగ్‌ సందర్భంగా ఢమాల్‌ అన్నాయి. పేటీఎం షేర్లు ఇష్యూ ప్రైస్‌గా రూ.2150గా మార్కెట్‌లోకి ఎంటరైంది.  లిస్టింగ్‌ సందర్భంగా పేటీఎం ఒక్క షేర్‌ ధర రూ.1950గా మొదలైంది. అయితే కేవలం గంటల వ్యవధిలోనే షేర్ల ధర వేగంగా క్షీణించింది. అరంగేట్రంలోనే స్టాక్ 27 శాతం పడిపోవడంతో రూ.38 వేల కోట్ల పేటిఎమ్ పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది.

VIDEO: ఒక్కసారిగా కన్నీళ్లు కార్చిన విజయ్‌ శేఖర్‌ శర్మ!

మరిన్ని వార్తలు