మాకు బజాజ్‌ ఫైనాన్స్‌ ఒక్కటే బెంచ్‌మార్క్‌: పేటీఎం సీఈవో విజయ్‌శేఖర్‌ శర్మ

13 Jan, 2022 08:12 IST|Sakshi

మార్చి క్వార్టర్‌లో రూ.1,050 కోట్ల టర్నోవర్‌ 

మాకు బజాజ్‌ ఫైనాన్స్‌ ఒక్కటే బెంచ్‌మార్క్‌ 

న్యూఢిల్లీ: చెల్లింపులు, మర్చంట్‌ ట్రాన్స్‌ఫర్‌ లావాదేవీలకు సంబంధించి టర్నోవర్‌ ప్రస్తుత(మార్చి) త్రైమాసికంలో 140 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1050 కోట్లు) ఉంటుందని, వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసుకుంటే 50-60 శాతం వృద్ధి నమోదవుతుందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్‌శేఖర్‌ శర్మ తెలిపారు. ఇండియా డిజిటల్‌ సదస్సులో భాగంగా శర్మ మాట్లాడారు. తదుపరి వ్యాపార ఇంజన్‌గా రుణాల మంజూరు విభాగాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం రుణాల సంఖ్య పరంగా ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ(బజాజ్‌ ఫైనాన్స్‌)ని పేటీఎం అధిగమించినట్టు శర్మ తెలిపారు. 

మార్కెట్‌ సైజ్‌ను అర్థం చేసుకోవడం లేదు 
‘‘మాది చెల్లింపుల కంపెనీ. చెల్లింపుల ఆదాయం శరవేగంగా వృద్ధి చెందుతోంది. కానీ, పేటీఎం విజయం ఆర్థిక సేవల విక్రయంపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో చెల్లింపుల నుంచి 100 మిలియన్‌ డాలర్లు (రూ.750కోట్లు) వస్తుందంటున్నాం. ఒక్క త్రైమాసికంలో ఇది గణనీయమైన మొత్తమే అవుతుంది. చెల్లింపుల వ్యాపారంలో మార్జిన్‌ 10 శాతం ఉంటుంది. దీనికి మర్చంట్‌ సేవలను (వర్తకులకు అందించే సేవలపై ఆదాయం) కూడా కలిపితే 140 మిలియన్‌ డాలర్లకు మొత్తం ఆదాయం చేరుతుంది. మార్జిన్లు 30-40 శాతం పెరుగుతాయి. చెల్లింపుల ఆదాయాన్ని (మార్కెట్‌ పరిమాణాన్ని) ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు’’ అని శర్మ వివరించారు. 

బుధవారం పేటీఎం షేరు బీఎస్‌ఈలో కనిష్ట స్థాయి రూ.1,075ని నమోదు చేసి చివరికి రూ.1,083 వద్ద ముగియడం గమనార్హం. పేటీఎం షేరు ధరపై శర్మ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా పేటీఎం పోటీ కంపెనీల షేర్లు గడిచిన ఆరు నెలల్లో 38-51 శాతం స్థాయిలో నష్టపోయినట్టు చెప్పారు. దక్షిణ అమెరికా కంపెనీల ధరలు అయితే ఏకంగా 70 శాతం పడిపోయినట్టు పేర్కొన్నారు.

బజాజ్‌ ఫైనాన్స్‌ కంటే ఎక్కువ.. 
పేటీఎం మూడేళ్ల కాలంలోనే బజాజ్‌ ఫైనాన్స్‌ కంటే ఎక్కువ రుణాలను మంజూరు చేస్తున్నట్టు శర్మ తెలిపారు. సగటు రుణ టికెట్‌ సైజు రూ.4,000గా ఉన్నట్టు చెప్పారు. భాగస్వాములు సైతం ఎంతో సంతోషంగా ఉన్నారని, మరింత మంది పేటీఎంలో భాగమయ్యేందుకు క్యూ కడుతున్నట్టు శర్మ ప్రకటించారు. డిసెంబర్‌ త్రైమాసికంలో రుణాల మంజూరు 4 రెట్లు పెరిగినట్టు పేటీఎం సోమవారం ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ 44 లక్షల రుణాలను జారీ చేసింది. వీటి మొత్తం విలువ రూ.2,180 కోట్లు. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో మంజూరు చేసిన రుణాలు 8.81 లక్షలు, విలువ రూ.470 కోట్లుగా ఉన్నట్టు పేటీఎం తెలిపింది.

(చదవండి: ఐటీ ఫ్రెషర్లకు విప్రో తీపికబురు..!)

మరిన్ని వార్తలు