పేటీఎమ్‌ ఐపీవోకు సెబీ ఓకే

23 Oct, 2021 05:26 IST|Sakshi

రూ. 16,600 కోట్ల సమీకరణకు రెడీ

అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ రికార్డ్‌కు చాన్స్‌

న్యూఢిల్లీ: డిజిటల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసుల దిగ్గజం పేటీఎమ్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ను పొందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గోప్యత పాటించే షరతుతో అనుమతించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెలాఖరుకల్లా పేటీఎమ్‌ ఐపీవోకు వచ్చే వీలున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఐపీవో ద్వారా రూ. 16,600 కోట్లు సమీకరించాలని పేటీఎమ్‌ మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ భావిస్తోంది. వెరసి దేశీ ప్రైమరీ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద ఇష్యూగా నిలిచే వీలుంది. ఇంతక్రితం 2010లో పీఎస్‌యూ దిగ్గజం కోల్‌ ఇండియా రూ. 15,200 కోట్ల సమీకరణ ద్వారా భారీ ఐపీవోగా రికార్డ్‌ సాధించింది.

కాగా.. వేగవంత లిస్టింగ్‌కు వీలుగా ఐపీవోకు ముందు నిర్వహించే(ప్రీఐపీవో) షేర్ల విక్రయాన్ని రద్దు చేసుకునే యోచనలో పేటీఎమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ విలువ నిర్ధారణలో వ్యత్యాసాలు ఇందుకు కారణంకాదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రూ. 1.47–1.78 లక్షల కోట్ల విలువను పీటీఎమ్‌ ఆశిస్తోంది. యూఎస్‌ స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఫైనాన్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విలువ మదింపు నిపుణులు అశ్వథ్‌ దామోదరన్‌ తాజాగా పేటీఎమ్‌ అన్‌లిస్టెడ్‌ షేర్లకు ఒక్కొక్కటీ రూ. 2,950 చొప్పున విలువను అంచనా వేయడం గమనార్హం!   పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా పేటీఎమ్‌ రూ. 8,300 కోట్ల విలువైన తాజా ఈక్వి టీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 8,300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ చేయనుంది.

మరిన్ని వార్తలు