ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్‌, విడుదల

13 Mar, 2022 11:13 IST|Sakshi

పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ అరెస్ట్‌ ఫిన్‌ టెక్‌ వర్గాల్లో కలకలం రేపుతుంది. విజయ్ శేఖర్ శర్మను ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. అరెస్ట్‌ అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.  

ఢిల్లీ పోలీస్‌ అధికార ప్రతినిధి సుమన్ నల్వా సమాచారం ప్రకారం..ఫిబ్రవరి 22న విజయ్‌ శేఖర్‌ శర్మ తన ల్యాండ్‌ రోవర్‌ కారులో మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వస్తుండగా డీసీపీ బెనిటా మేరీ జాకర్ ను ఢీకొట‍్టారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే డీసీపీ కారును డ్రైవ్‌ చేస్తున్న డ్రైవర్, కానిస్టేబుల్ దీపక్ కుమార్ విజయ్‌ ల్యాండ్ రోవర్ నంబర్‌ను గుర్తించి, వెంటనే డీసీపీకి సమాచారం అందించినట్లు సుమన్ నల్వా తెలిపారు.

ప్రాథమిక విచారణ తర్వాత ల్యాండ్‌ రోవన్‌ కారును గుర్గావ్‌లోని ఒక కంపెనీలో రిజిస్టర్ చేసినట్లు, ఆ కారు దక్షిణ ఢిల్లీలో నివసిస్తున్న పేటీఎం సీఈఓ విజయ్ శంకర్ శర్మదేనని పోలీసులు నిర్ధారించారు. ర్యాష్ డ్రైవ్‌ చేశారనే కారణంగా పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విజయ్ శేఖర్ శర్మను అరెస్టు చేశారు. అరెస్ట్‌ తర్వాత  ఆయన బెయిల్‌పై విడుదలయ్యారని సుమన్ నల్వా ధృవీకరించారు.

కాగా, మార్చి 11న  పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు ఆర్‌బీఐ నోటీసులు జారీ చేసింది. కొత్తగా వచ్చే  ఖాతాదారుల్ని ఆన్ బోర్డింగ్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు చెందిన ఐటీ వ్యవస్థను సమగ్రంగా ఆడిట్ చేయడానికి ఐటీ ఆడిట్ సంస్థను నియమించాలని సూచించింది. ఈ నేపథ్యంలో విజయ్‌ శేఖర్‌ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారనే వార్తలు హాట్‌ టాపిగ్గా మారాయి.

చదవండి: కష్టపడేతత్వం ఉంటే చాలు... కుటుంబ నేపథ్యం, ఇంగ్లీష్‌ పరిజ్ఞానంతో పని లేదు

మరిన్ని వార్తలు