ఐఎంజీసీతో పిరమల్‌ క్యాపిటల్‌ జట్టు, ఉద్యోగులకు భారీ ఎత్తున రుణాలు!

17 Mar, 2022 18:39 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియా మార్టిగేజ్‌ గ్యారంటీ కార్పొరేషన్‌(ఐఎంజీసీ)తో తాజాగా పిరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ చేతులు కలిపింది. తద్వారా ఉద్యోగులు, ఉద్యోగేతరులకు రూ. 5–75 లక్షల మధ్య గృహ రుణాలను ఆఫర్‌ చేసేందుకు సిద్ధపడుతోంది. ఒప్పందంలో భాగంగా పిరమల్‌ క్యాపిటల్‌ జారీ చేసే గృహ రుణాలకు ఐఎంజీసీ గ్యారంటీని కల్పిస్తుంది. దీంతో రుణ చెల్లింపుల్లో వైఫల్యం ఎదురైనప్పటికీ హామీ లభిస్తుంది. 

ఈ భాగస్వామ్యం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో 10–12 శాతం బిజినెస్‌ను సాధించాలని పిరమల్‌ క్యాపిటల్‌ భావిస్తోంది. ప్రధానంగా సొంతింటికి ఆసక్తి చూపే ఉద్యోగులు, స్వయం ఉపాధి కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ‘గృహ సేతు హోమ్‌ లోన్‌’ పేరుతో ఈ రుణాలను అందించనుంది. పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన పిరమల్‌ క్యాపిటల్‌ దేశవ్యాప్తంగా గల 300 బ్రాంచీలను రుణ పంపిణీకి వినియోగించుకోనుంది. 

ఈ పథకంలో భాగంగా రూ.5–75 లక్షల మధ్య రుణాలను గరిష్టంగా 25ఏళ్ల కాలపరిమితితో మంజూరు చేయనున్నట్లు పిరమల్‌ క్యాపిటల్‌ తెలియజేసింది. కాగా..రుణ భారంతో దివాలాకు చేరిన దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ను పిరమల్‌ క్యాపిటల్‌ చేజిక్కించుకున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు