డబ్బే డబ్బు!! స్టార్టప్‌లోకి పెట్టుబడుల వరద!

17 Mar, 2022 15:59 IST|Sakshi

ముంబై: ఇటీవల దేశీ స్టార్టప్‌ వ్యవస్థలోకి భారీగా తరలి వస్తున్న ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ), వెంచర్‌ క్యాపిటల్‌(వీసీ) పెట్టుబడులు ఫిబ్రవరిలో మరింత జోరందుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన ఫిబ్రవరిలో రెట్టింపై 5.8 బిలియన్‌ డాలర్లను తాకాయి.

గతేడాది(2021) ఫిబ్రవరిలో ఇవి 2.5 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఐవీసీఏ–ఈవై రూపొందించిన నెలవారీ గణాంకాలివి. వీటి ప్రకారం ఫిబ్రవరిలో డీల్‌ పరిమాణం 33 శాతం ఎగసి 117కు చేరాయి. అయితే 2022 జనవరిలో నమోదైన 122 డీల్స్‌తో పోలిస్తే స్వల్పంగా క్షీణించాయి. కాగా.. పీఈ, వీసీ పెట్టుబడుల్లో 88 శాతం రియల్టీ, ఇన్‌ఫ్రా రంగాలను మినహాయించి ప్యూర్‌ప్లే ఇన్వెస్ట్‌మెంట్స్‌ కావడం గమనార్హం! గతేడాది ఫిబ్రవరిలో ఈ వాటా 79 శాతమే. 

17 భారీ డీల్స్‌ 
గత నెలలో మొత్తం 4.4 బిలియన్‌ డాలర్ల విలువైన 17 భారీ డీల్స్‌ జరిగాయి. నెలవారీగా చూస్తే ఇవి 24 శాతం అధికం. మొత్తం పెట్టుబడుల్లో దాదాపు సగం అంటే 2.5 బిలియన్‌ డాలర్లు స్టార్టప్‌లలోకే ప్రవహించడం విశేషం! కాగా.. 85 డీల్స్‌ ద్వారా అత్యధిక పెట్టుబడులను స్టార్టప్స్‌ ఆకట్టుకున్నాయి. ఇక ఏడు డీల్స్‌ ద్వారా 1.5 బిలియన్‌ డాలర్ల విలువైన కొనుగోళ్లు నమోదయ్యాయి. మరోపక్క 1.4 బిలియన్‌ డాలర్ల విలువైన 10 విక్రయ డీల్స్‌ సైతం జరిగాయి. వీటిలో మూడు డీల్స్‌ 1.2 బిలియన్‌ డాలర్ల విలువైన సెకండరీ విక్రయాలు కావడం గమనార్హం!

చదవండి: భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం, క్యూ కడుతున్న సరిహద్దు దేశాలు!

మరిన్ని వార్తలు