దేశీ రియల్టీ రంగంలో డీలా పడ్డ పీఈ పెట్టుబడులు

20 Apr, 2022 13:21 IST|Sakshi

రియల్టీలో పీఈ పెట్టుబడులు వీక్‌ 

జనవరి–మార్చిలో 47 శాతం డౌన్‌

న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు ఈ క్యాలండర్‌ ఏడాది(2022) తొలి త్రైమాసికంలో డీలా పడ్డాయి. ఈ క్యూ1(జనవరి–మార్చి)లో 47 శాతం క్షీణించి 100 కోట్ల(బిలియన్‌) డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021) ఇదే కాలంలో 1.9 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ లభించాయి. అయితే గతేడాది క్యూ4(అక్టోబర్‌–డిసెంబర్‌)లో 21.8 కోట్ల డాలర్ల పెట్టుబడులే నమోదయ్యాయి.

వీటితో(త్రైమాసికవారీగా) పోలిస్తే పీఈ పెట్టుబడులు తాజా క్వార్టర్‌లో 4.5 రెట్లు జంప్‌చేసినట్లని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ సావిల్స్‌ ఇండియా పేర్కొంది. ఈ క్యూ1లో వాణిజ్య కార్యాలయాల ఆస్తులు అత్యధిక పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు తెలియజేసింది. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 70 శాతాన్ని ఆక్రమించడం గమనార్హం! విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి లభించిన అత్యధిక శాతం త్రైమాసిక పెట్టుబడుల్లో బెంగళూరులోని కీలక ఆఫీసు ఆస్తులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు సావిల్స్‌ ఇండియా వెల్లడించింది.

కాగా.. ఈ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో దేశీ రియల్టీ రంగ పీఈ పెట్టుబడులు 32 శాతం వెనకడుగు వేసినట్లు గత వారం అనరాక్‌ నివేదిక పేర్కొన్న విషయం విదితమే. 2020–21లో తరలివచ్చిన 6.3 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 4.3 బిలియన్‌ డాలర్లకే పరిమితమైనట్లు తెలియజేసింది.  

చదవండి: షాకింగ్‌ న్యూస్‌..భారీగా పెరగనున్న ఇళ్ల ధరలు..కారణం అదే..?

మరిన్ని వార్తలు