పెగాసెస్‌కు మించి: మరో స్పైవేర్ ‘హెర్మిట్‌’ కలకలం

18 Jun, 2022 16:23 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెగాసెస్‌  రేపిన వివాదం చల్లారకముందే మరో స్పైవేర్‌ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఆండ్రాయిడ్‌ స్పైవేర్‌ ‘హెర్మిట్‌’ను సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకులు తాజాగా గుర్తించారు. వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు,  కొంతమంది ప్రభుత్వ ఉన్నతోద్యోగులను ఆయా ప్రభుత్వాలు 'హెర్మిట్'  ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ ఆండ్రాయిడ్ స్పైవేర్‌ ద్వారా టార్గెట్‌ చేసినట్టు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు  వెల్లడించారు. 

సైబర్-సెక్యూరిటీ కంపెనీ లుక్అవుట్ థ్రెట్ ల్యాబ్‌ టీంఈ  మాలావేర్‌ను గుర్తించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలను అణిచి వేసిన నాలుగు నెలల తర్వాత ఏప్రిల్‌లో కజకిస్తాన్ ప్రభుత్వం ఉపయోగించినట్టు గుర్తించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కనుగొన్నామని ఈ బృందం పేర్కొంది. జాతీయ భద్రత ముసుగులో వ్యాపార వేత్తలు, మానవహక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులపై గూఢచర్యం చేయడానికి వారిపై నిఘాకు తరచుగా వాడు కుంటున్నారని పరిశోధకులు హెచ్చరించారు.

హెర్మిట్ అనేది మాడ్యులర్ స్పైవేర్. ఆడియోను రికార్డ్, ఫోన్ కాల్‌ల డైవర్షన్‌ అలాగే కాల్ లాగ్‌లు, ఫ్రెండ్స్‌, ఫోటోలు, లొకేషపన్లను లాంటి వాటిని ఎస్‌ఎంఎస్‌ ద్వారా డేటాను చోరీ చేస్తుంది. ఈ మాలావేర్‌ టెలికమ్యూనికేషన్ కంపెనీ, స్మార్ట్‌ఫోన్ తయారీదారుల అప్లికేషన్‌లను కూడా  ప్రభావితం చేశాయని లుకౌట్ బృందం తెలిపింది.

'హెర్మిట్' అని పేరు పెట్టిన ఈ స్పైవేర్‌ను ఇటాలియన్ స్పైవేర్ ఆర్‌సీఎస్‌ ల్యాబ్,టెలీ కమ్యూనికేషన్స్ సొల్యూషన్స్ కంపెనీTykelab Srl సహకారంతో అభివృద్ధి చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నామని పరిశోధకులు బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. అయితే హెర్మిట్‌ నిఘా ఇదే మొదటిసారి కాదు. 2019లో అవినీతి నిరోధక చర్యలో ఇటాలియన్ అధికారులు దీనిని ఉపయోగించారట.ఆర్‌సీఎస్‌ ల్యాబ్‌ మూడు దశాబ్దాలుగా యాక్టివ్‌గా ఉన్న ప్రసిద్ధ డెవలపర్. ఇది కూడా  పెగాసస్ డెవలపర్ ఎన్‌ఎస్‌వో గ్రూప్ టెక్నాలజీస్, ఫిన్‌ఫిషర్‌ని సృష్టించిన గామా గ్రూప్‌ల మాదిరిగానే అదే మార్కెట్‌లో పనిచేస్తుంది. అలాగే ఇది పాకిస్తాన్, చిలీ, మంగోలియా, బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్, తుర్క్‌మెనిస్తాన్‌లోని సైనిక, గూఢచార సంస్థలతో నిమగ్నమై ఉన్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు