ఐపీవోల్లోనూ పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్ల పెట్టుబడులు

21 Jul, 2021 01:23 IST|Sakshi

త్వరలో పీఎఫ్‌ఆర్‌డీఏ అనుమతి

ముంబై: ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్స్‌ (ఐపీవోలు), ఎన్‌ఎస్‌ఈ–200 కంపెనీల్లో కూడా పెన్షన్‌ ఫండ్‌ల మేనేజర్లు (పీఎఫ్‌ఎం) ఇన్వెస్ట్‌ చేసేందుకు త్వరలో అనుమతులు ఇవ్వనున్నట్లు పింఛను రంగ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్‌ సుప్రతిమ్‌ బందోపాధ్యాయ్‌ వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో కొత్త నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు ఆయన తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టులు, ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టులు జారీ చేసే డెట్‌ సాధనాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు పీఎఫ్‌ఎంలను అనుమతించే అవకాశాలు ఉన్నాయని బందోపాధ్యాయ్‌ వివరించారు.

ప్రస్తుతం పీఎఫ్‌ఎంలు తమ కార్పస్‌లోని ఈక్విటీ విభాగం నిధులను రూ. 5,000 కోట్ల పైచిలుకు మార్కెట్‌ క్యాప్‌ ఉండి, ఆప్షన్స్‌ అండ్‌ ఫ్యూచర్స్‌ సెగ్మెంట్‌లో ట్రేడయ్యే స్టాక్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్‌ చేసేందుకు అనుమతులు ఉన్నాయి. దీనివల్ల ఫండ్‌ మేనేజర్లు మెరుగైన రాబడులు అందించే అవకాశాలు పరిమితంగా ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్‌ఎంలు.. ఐపీవోలు, ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మొదలైన వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో ట్రేడయ్యే టాప్‌ 200 స్క్రిప్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేయడానికి వీలుంటుంది. ఈక్విటీలపరంగా ఎదురయ్యే రిస్కులను తగ్గించేందుకు తగిన నిబంధనలు ఉంటాయి. ఈక్విటీ పెట్టుబడులు మెరుగైన రాబడులు అందిస్తున్న నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా ఈక్విటీ పెట్టుబడుల వైపే మొగ్గు చూపుతానని బంద్యోపాధ్యాయ్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు